Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Congress: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ గాంధీ ఫోకస్.. ఇవాళ ముఖ్యనేతలతో విడివిడిగా చర్చలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు.

AP Congress: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ గాంధీ ఫోకస్.. ఇవాళ ముఖ్యనేతలతో విడివిడిగా చర్చలు!
Rahul Gandhi Focus On Andhra Pradesh Congress
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 11, 2021 | 10:03 AM

Rahul Gandhi focus on AP: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ గాంధీ దృష్టిసారించారు. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, అస్సాం,కేరళ సహా పలు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. రేపు ఏపీకి సంబంధించిన ముఖ్య కాంగ్రెస్ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే, ఏపీకి చెందిన ముఖ్యనేతలతో చర్చలు జరిపిన రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం మరికొందరితో విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ మేరకు నేతలను ఢిల్లీకి రావల్సిందిగా సమాచారం అందించాయి పార్టీ వర్గాలు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు రేవంత్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేసి.. పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలను ఢిల్లీ రావాలని ఆ పార్టీ హైకమాండ్ సమాచారం అందించినట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు, రఘువీరారెడ్డి సహా పలువురు నేతలతో విడివిడిగా రాహుల్ గాంధీ భేటీ కానున్నారు. పార్టీలోని దళిత నేతలు హర్షకుమార్, చింతమోహన్, జేడీ శీలంతో ఇప్పటికే రాహుల్ చర్చించారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే దానిపై ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే సమాలోచనలు జరుపుతోంది. దీనిపై ఓ సమగ్ర నివేదిక ఇవ్వాలని రాహుల్ గాంధీ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఉమెన్ చాందీని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే కసరత్తు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టులోనే ఏపీ కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన జరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

అయితే, ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్‌ను మార్చి.. ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారా లేక ఆయనను కొనసాగిస్తూనే మిగతా ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పగిస్తారా ? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, ఏపీ కాంగ్రెస్ ముఖ్యనేతలు ఢిల్లీ బాట పడితేనే.. అసలు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను మళ్లీ బలోపేతం చేసేందుకు ఆ పార్టీ హైకమాండ్ ఎలాంటి చర్యలు చేపడుతుందనే విషయంలో క్లారిటీ వస్తుందని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read Also…  GSLV: జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ ప్రారంభం.. దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించనున్న శాటిలైట్