Vijayawada: రోడ్లపై స్వైరవిహారం.. కనిపించిన వారిపై దాడి.. వీధి కుక్కలతో భయంతో నగరవాసులు..
విజయవాడ నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ ఘటనతో బెజవాడ పబ్లిక్ అప్రమత్తం అవుతున్నా..
విజయవాడ నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ ఘటనతో బెజవాడ పబ్లిక్ అప్రమత్తం అవుతున్నా వీఎంసీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటంతో నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై మనుషులు కనిపిస్తే చాలు కుక్కలు అరుచుకుంటూ మీదికొచ్చేస్తున్నాయంటున్నారు స్థానికులు. భవానీపురంలో ముగ్గురు విద్యార్థులపై దాడి చేసింది. స్థానికులు అప్రమత్తం అవ్వటంతో ప్రమాదం తప్పింది. మరో ఇద్దరు చిన్నారులపై దాడి చేశారు. దీంతో కుక్కల నుంచి తమను రక్షించాలని, తమ ఏరియా నుంచి కుక్కలను తరిమిగొట్టాలని కోరుతున్నారు.
కాగా.. కుక్కల దాడిలో పిల్లలు మరణించడం, తీవ్రంగా గాయపడడం వంటి విషాద ఘటనలు జరిగినపుడే అధికారులు హడావుడి చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు తగ్గించడంతో వీధి శునకాల సంఖ్య పెరుగుతోంది. 2022లో దేశంలో అత్యధికంగా కుక్కకాట్లు నమోదైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో 4.50 లక్షలకు పైగా వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా.
ఏటా ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండ వేడిమి, ఆహారం కొరత వంటి కారణాలతో అవి దాడి చేస్తున్నాయి. ఈ కాలంలో వీధి కుక్కలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు. బైక్ లపై వెళ్లేవారు మరింత జాగ్రత్త ఉండాలని చెబుతున్నారు.
తాజాగా.. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రెండో జోన్ లో శైలజ (8), మూడో జోన్ లో సహస్ర (9) అనే చిన్నారులపై పిచ్చికుక్కల దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటుండగా ఒక్కసారిగా దాడి చేశాయి. చిన్నారులను చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..