Solar eclipse: సూర్యగ్రహణం.. మళ్లీ రోకళ్లు నిలబడ్డాయ్.. మీరు ఇలా ఎప్పుడైనా చూశారా..?
దేశంలో పాక్షికంగా ఏర్పడింది సూర్యగ్రహణం. గరిష్టంగా గంటా 45 నిమిషాల పాటు గ్రహణం కొనసాగింది. చాలా జాగ్రత్తలతో ఎక్లిప్స్‌ని జనం ఆసక్తిగా తిలకించారు. మరోవైపు గ్రహణం కారణంగా నిర్మానుష్యంగా మారిపోయాయి రహదారులు.

సూర్యగ్రహణం సందర్భంగా రోకళ్లు నిలబడతాయా… అవుననే అంటున్నారు పార్వతీపురానికి చెందిన జనం. అందుకు నిదర్శనంగా గ్రహణం మొదలుకాగానే కంచు గిన్నెలు, ఇత్తడి పళ్లెంలో పసుపు నీళ్లు పోసి రోకళ్లను నిల్చోబెట్టారు. ఆపై పూజలు చేశారు. ఇది తరతరాల నుంచి వస్తున్న నమ్మకం అని అందుకు తగ్గట్టే గ్రహణం వచ్చే ప్రతిసారి నిజమవుతుందని స్థానికులు చెప్పారు. గ్రహణం పూర్తయిన తర్వాత రోకళ్లు వాటంతట అవే పడిపోతాయని అన్నారు. వాళ్లు చెప్పినట్టే గ్రహణం ముగిసిన తర్వాత రోకళ్లు పడిపోయాయి. ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్య స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇదంతా ట్రాష్ అని… మూఢ నమ్మకమని జన విజ్ఞాన వేదిక సభ్యులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో 4.59 నిమిషాలకు ప్రారంభమైన గ్రహణం
ఇండియాలో పాక్షికంగా కనిపించింది గ్రహణం. ఢిల్లీలో 4.29 నిమిషాలకి.. హైదరాబాద్‌లో 4 గంటల 59 నిమిషాలకు.. విశాఖలో 5 గంటల 2 నిమిషాలకు, ఏపీలోని విజయవాడలో 4 గంటల 49 నిమిషాలకు, గ్రహణం ప్రారంభమైంది. సోలార్ ఎక్లిప్స్‌ని తిలకించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాక్షిక సూర్యగ్రహణాన్ని కొంతమంది బ్లాక్ ఫిల్మ్, గాగుల్స్ సాయంతో చూసి ఫిదా అయ్యారు. దాదాపు గంటా 45 నిమిషాలపాటు సూర్య గ్రహణం కనువిందు చేసింది. గ్రహణం ఎఫెక్ట్‌తో నగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జనం బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. గ్రహణం పూర్తయ్యాక శుద్దిస్నానమాచరించారు చాలామంది. ఏడున్నర గంటల తర్వాత సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి. గ్రహణం సందర్భంగా నదీ తీరాలకు పోటెత్తారు భక్తులు. పుణ్య స్నానాలు ఆచరించి, గ్రహణ దోష నివారణ పూజలు చేశారు.
పాక్షిక సూర్యగ్రహణం మళ్లీ 27 ఏళ్ల తర్వాత ఏర్పడనుంది. 2025 లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నా.. అది భారత్ లో కనిపించదు. మళ్లీ మనం సూర్యగ్రహణం వీక్షించాలంటే 2032 వరకు ఆగాల్సిందే. ఈ కారణంగానే చాలామంది సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి