AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు.. అసలు విషయం ఇదే..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది.

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజులలోపే ప్రపంచ రికార్డు.. అసలు విషయం ఇదే..
Pawan Kalyan
P Kranthi Prasanna
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 16, 2024 | 3:22 PM

Share

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజులలోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసంలో కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని, మెడల్‌ను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు అందజేశారు. గ్రామాలకు స్వపరిపాలన అందించాలనే ఆకాంక్షతో మొదలైన ఈ ప్రయాణంలో ఈ కొత్త మైలు రాయిని అందుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గ్రామ సభలు విజయవంతం చేయడంలో భాగస్వాములైన అధికార యంత్రాంగానికి, స్థానిక సంస్థల ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామ సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలియచేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామసభల్లో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణ తేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ పాల్గొన్నారు.

వీడియో చూడండి..

గ్రామాలు స్వయం సమృద్ధి సాధించి ‘స్వర్ణ పంచాయతీ’లుగా అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.. ఇందులో భాగంగా ఆగస్టు 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ గ్రామసభల్లో లక్షలాది గ్రామీణులు, రైతులు, కూలీలు, అధికారులు, కలెక్టర్లు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వానపల్లి గ్రామంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మైసూరవారిపల్లెలో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్నారు. ఈ సభల్లో మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సాగించే అభివృద్ధి పనులు మీద, వివిధ పథకాలు ఉపయోగించుకొని గ్రామాలు ఎలా అభివృద్ధి బాటలో సాగలన్నదానిపై విస్తృత్తంగా చర్చ జరిగింది. గ్రామసభల్లో ఒకేరోజున రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల పనులను ఆమోదించారు. 87 విభిన్న పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. ఈ పనుల వల్ల 9 కోట్ల మందికి ఉపాధి లభించేలా, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి ఫలాలు అందేలా గ్రామసభల్లో నిర్ణయాలు జరిగాయి. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, పశువుల పాకలు, చెరువుల పూడికతీత, హార్టికల్చర్ పనులు, చెక్ డ్యాం నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తదితర పనులను చేసుకునేందుకు గ్రామస్థులంతా ఒకేసారి రాష్ట్రంలో ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలను తూతూమంత్రంగా నిర్వహించకుండా గ్రామీణులంతా కలిసి కూర్చొని చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా చైతన్యం కలిగించింది. మహిళలు, యువత గ్రామసభలకు తరలివచ్చి గ్రామానికి ఏమి అవసరమో దానిపై చర్చించి, తీర్మానం చేసేలా ప్రోత్సహించింది.

రాష్ట్రమంతటా ఒకేసారి జరిగిన ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం భారతదేశంలోనే జరిగిన అతి పెద్ద గ్రామపాలన కార్యక్రమంగా ప్రపంచ రికార్డులకెక్కింది. ఇదే స్ఫూర్తిని, గ్రామాల భవిష్యత్తు కీర్తిని, కొండంత ఆశయ దీప్తితో ముందుకు తీసుకెళ్లి గ్రామ స్వపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలన్నదే కూటమి లక్ష్యం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..