Anantapur: స్కూల్ మీద అలిగిన పిల్లల తల్లిదండ్రులు… ఎందుకో తెలుసుకుందాం పదండి
ఎక్కడైనా టీచర్ కొడుతుందనో, తిడుతుందనో అలిగి విద్యార్థులు స్కూలుకు వెళ్లకుండా మారం చేస్తుంటారు. కానీ అక్కడ పిల్లల తల్లిదండ్రులే స్కూల్ మీద అలిగారు. స్కూల్ మీద, టీచర్ల మీద అలిగి తమ పిల్లల్ని స్కూల్‌కి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు తల్లిదండ్రులు. ఇంతకీ ఆ పేరెంట్స్ అసలు స్కూల్ మీద ఎందుకు అలిగారు?
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామంలో పిల్లల్ని స్కూల్‌కి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు తల్లిదండ్రులు. ఎందకంటే తాము టీచర్ల మీద, స్కూల్ మీద అలిగాం అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. క్రిష్టిపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలిని తొలగించాలని గత ఆరు నెలలుగా స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేస్తున్నారు పిల్లల తల్లిదండ్రులు. స్కూల్లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న రమణమ్మ పిల్లలను బాత్రూంకి వెళ్లకుండా అడ్డుకుంటుందని ఒకవేళ ఎవరైనా పిల్లలు బాత్రూంకు వెళితే వారి చేతనే బాత్రూం శుభ్రం చేయిస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆమెను తొలగించే వరకు పిల్లల్ని స్కూలుకి పంపించబోమంటూ పేరెంట్స్ భీష్మించుకు కూర్చున్నారు
క్రిష్టిపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 80 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల ఆయా… అదే విదంగా పారిశుద్ధ్య కార్మికురాలు అయిన రమణమ్మ పాఠశాలలో ఏర్పాటు చేసిన బాత్రూంలోకి వెళ్లనివ్వడం లేదు. ఆరు బయటనే మలమూత్ర విసర్జన చేయాలంటూ విద్యార్థులకు చెప్పడంతో.. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసి పిల్లల్ని స్కూల్‌కి పంపించకుండా ఇంట్లోనే ఉంచుకున్నారు. దీంతో స్కూల్లో కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే టీచర్లు పాఠాలు చెప్పారు. అదికూడా పారిశుధ్య కార్మికురాలు రమణమ్మ కుమారుడు మాత్రమే మాత్రమే గమనార్హం.
దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అదేవిధంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు గ్రామంలోకి వెళ్లి పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పారిశుధ్య కార్మికురాలిపై చర్యలు తీసుకొని వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో స్కూల్ టీచర్లు, పాఠశాలపై అలిగిన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్కూలుకు పంపించారు.. దీంతో ప్రస్తుతానికి ఈ చిక్కుముడైతే వీడింది.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..