Andhra Pradesh: ఆ బీచ్‌లో విదేశీ పక్షుల సందడి.. చుట్టూ నీరు-మధ్యలో ఐలాండ్.. బాహ్య ప్రపంచానికి తెలియని సుందరమైన సముద్రతీరం..
Kanaparthi Beach: పర్యాటక ప్రాంతాలలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా వేసవి ఎండల బారి నుంచి తప్పించుకునేందుకు విహార యాత్రలు చేసేవారు అందుకు అనువైన ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. అలాంటి ప్రాంతాలలో ప్రకాశం జిల్లా కనపర్తి బీచ్ అందాలు ఒకటి.

Kanaparthi Beach: పర్యాటక ప్రాంతాలలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా వేసవి ఎండల బారి నుంచి తప్పించుకునేందుకు విహార యాత్రలు చేసేవారు అందుకు అనువైన ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. అలాంటి ప్రాంతాలలో ప్రకాశం జిల్లా కనపర్తి బీచ్ అందాలు ఒకటి… అయితే ఈ బీచ్ సోయగాలు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియవు… కనపర్తి చుట్టుపక్కల గ్రామాల వారికి మినహాయించి ఈ బీచ్‌లో ఓ ఐలాండ్ ఉందన్న సంగతి తెలియకపోవడం విడ్డూరమే… ఈ ఐలాండ్‌లో జనసంచారం లేకపోవడం వల్ల విదేశీ పక్షులు సందడి చేస్తుంటాయి… గుండ్లకమ్మ నది సముద్రతీరంలో కలిసే చోట ఏర్పడిన ఐలాండ్ అందాలు చూసి తీరాల్సిందే… కనపర్తి బీచ్‌లో ఉన్న ఐలాండ్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు గ్రామాభివృద్దికి కూడా ఊతం లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు.
నదీ సాగర సంగమ క్షేత్రం..

శివలింగాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కనపర్తి గ్రామం ఒకప్పుడు ఆధ్యాత్మిక, చారిత్రక సంపదలకు నిలయంగా ఉండేది… ఇప్పుడు కూడా ఎక్కడ తవ్వినా శివలింగాలు, బుద్దుని ప్రతిమలు లభ్యమవుతాయి… ఇక్కడ హిందూ మతంతో పాటు బౌద్దమతం కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందింది… ఈ గ్రామంలో క్రీస్తూ పూర్వం 10 వేల సంవత్సరాల నాటి రాతియుగపు పనిముట్లు లభ్యమయ్యాయి… దీంతో ఈ గ్రామం రాతియుగంలో కూడా విలసిల్లిందని భావిస్తారు… ఇక్కడ మరో విశేషం ఏంటంటే బ్రహ్మ ఐదు శిరస్సులో ఒక శిరస్సును తన గోటితో ఖండించిన శివుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవడంతో ఆ పాప పరిహారం కోసం కనపర్తి గ్రామంలో గుండ్లకమ్మగా పిలువబడే అప్పటి బ్రహ్మకమండలిని నది సముద్రంలో కలిసే ప్రాంతంలో స్నానమాంచినట్టు స్థల పురాణం చెబుతోంది.
బీచ్‌లో ఐలాండ్..
కనపర్తి గ్రామంలో బాహ్య ప్రపంచానికి తెలియని మరో అబ్బురపరిచే బీచ్ అందాలు మరుగునపడి ఉన్నాయి… ఇక్కడి సముద్రతీరం మిగిలిన తీరాలకు భిన్నంగా ఫ్లాట్‌గా ఉంటుంది… కారణమేంటంటే ప్రాచీన కాలంలో బ్రహ్మకమండలినిగా పిలువబడి నేడు గుండ్లకమ్మగా ప్రాచుర్యంలో ఉన్న నది సాగరంలో సంగమించే పవిత్ర క్షేత్రం ఉంది… ఈ నదీసాగర సంగమ ప్రాంతంలో అద్భుతమైన ఐలాండ్ ఏర్పడింది… ఈ ఐలాండ్‌లో ఎక్కడి నుంచో వస్తున్న విదేశీపక్షులు సందడి చేస్తుంటాయి… స్థానికులు వీటి జోలికి వెళ్ళరు… మత్స్యకారులు కూడా సహస సిద్దంగా ఏర్పడిన ఈ ఐలాండ్ దగ్గరే తమ పడవలను కట్టేసి ఉంచుతారు… చుట్టూ సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తే కనపర్తి గ్రామం మరింత అభివృద్ది చెందుతుందని గ్రామస్థులు చెబుతున్నారు… ప్రాచీన వారసత్వ సంపదతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా కనపర్తి పర్యాటకులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. బాహ్యప్రపంచానికి పెద్దగా పరిచయం లేని కనపర్తి బీచ్‌లో ఉన్న ఐలాండ్ అందాలను జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే…





కనపర్తి బీచ్‌లో విదేశి పక్షులు
కనపర్తి బీచ్‌లో ఉన్న ఐలాండ్‌కు పడవలో చేరుకున్న తరువాత అక్కడి నుంచి బాహ్యప్రపంచాన్ని చూస్తే మైమరచిపోవాల్సిందే… కాకినాడ నుంచి చెన్నై వరకు ఇలాంటి అందమైన ఐలాండ్ లేదని స్థానికులు చెబుతారు… ఎందుకంటే నదీ, సాగర సంగమ కేంద్రంలో ఇలాంటి ఆరుదైన ఐలాండ్‌లు ఉంటాయని, అలాంటి ఐలాండ్ ఇక్కడే కనిపిస్తుందని చెబుతున్నారు… స్తానిక మత్య్యకారులు మినహాయించి ఈ ఐలాండ్‌లో బయటి వ్యక్తులు అడుగుపెట్టిందే లేదట… అలాంటి ఐలాండ్‌లో బయటినుంచి వచ్చిన వారిలో మొదటిసారి కాలుపెడితే ఆ అనుభూతేవేరప్ప అంటూ పరవశించి పోవడం ఖాయం… అయితే దురదృష్టం ఏంటంటే అక్కడ పర్యాటకుల కోసం ఎలాంటి సౌకర్యాలు ఉండవు… ఏదైనా మనం వెంట తీసుకెళ్ళాల్సిందే.. అందుకే ఈ ప్రాంతాన్ని పర్యాటక శాఖ గుర్తించి ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఈ బీచ్ మరింత అభివృద్ది చెందడం ఖాయమని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
-ఫైరోజ్ బేగ్, టీవీ9 రిపోర్టర్, ఒంగోలు
మరిన్ని ఏపీ వార్తలు చదవండి