Govt Hospital: ఆసుపత్రిలో పాము కలకలం.. భయంతో పరుగులు తీసిన రోగులు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పాము కలకలం రేపింది. ఆస్పత్రిలోకి దూరిని పాము పడగ విప్పడంతో రోగులు భయాందోళనతో పరుగులు తీశారు. ఆస్పత్రి పరిసరాలు శుభ్రం లేకపోవడంతో పాములు ఆస్పత్రిలోకి వస్తున్నాయని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు..
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలల సత్వర చికిత్స కేంద్రంలో త్రాచుపాము కలకలం రేపింది. బాలల సత్వర చికిత్స కేంద్రంలో చిన్నారులు చికిత్స పొందుతుంటారు. చిన్న పిల్లలకు సంబంధించి ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా ఇక్కడ త్వరితగతిన మెరుగైన వైద్యం అందిస్తారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ బాలల సత్వర చికిత్స కేంద్రంలో ప్రస్తుతం పలువురు చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. వారికి చికిత్స అందించే క్రమంలో ఆసుపత్రి సిబ్బంది కూడా బిజీబిజీగా ఉన్నారు. చికిత్స పొందుతున్న చిన్నారుల బంధువులు కూడా అక్కడే ఉన్నారు. అలా అందరూ ఎవరి పనిలో వారు ఉండగా అకస్మాత్తుగా ఒక త్రాచుపాము ఆసుపత్రిలోకి దూసుకు వచ్చింది. అలా వచ్చిన నాగుపాము ఆసుపత్రిలో జనాలను గమనించి వెంటనే పడగ విప్పి బుసలు కొట్టడం ప్రారంభించింది.
దీంతో పామును చూసిన వైద్యం పొందుతున్న చిన్నారులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో అక్కడ నుండి పరుగులు తీశారు. కొన్ని క్షణాల్లోనే ఆసుపత్రి అంతా గందరగోళంగా మారింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని పామును కర్రలతో చంపేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు, బంధువులు, సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆసుపత్రి పరిసరాలు సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు పాములు వస్తున్నాయని, దీంతో భయంతో గడపాల్సి వస్తుందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. ఆస్పత్రి పరిసరాలు శుభ్రం చేసి విష సర్పాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి