Andhra Pradesh Politics: వైసీపీ ప్రభుత్వం – వాలంటీర్ల వ్యవస్థ.. ప్రతిపక్ష పార్టీల వ్యూహం అదేనా..?
Volunteers - AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల చుట్టూ ఇప్పుడు రాజకీయ తుఫాన్ నడుస్తోంది. జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ కామెంట్లు వర్షాల కాలంలో సెగలు పుట్టిస్తున్నాయి. రోడ్డెక్కిన వాలంటీర్లు.. పవన్‌పై కారాలు, మిరియాలు నూరుతున్నారు.
Volunteers – AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల చుట్టూ ఇప్పుడు రాజకీయ తుఫాన్ నడుస్తోంది. జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ కామెంట్లు వర్షాల కాలంలో సెగలు పుట్టిస్తున్నాయి. రోడ్డెక్కిన వాలంటీర్లు.. పవన్‌పై కారాలు, మిరియాలు నూరుతున్నారు. అధికార, జనసేన నాయకులు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్ వెదర్ హాట్‌గా మారిపోయింది. అయితే, దేశంలోనే తొలిసారిగా వాలంటీర్ వ్యవస్థతో జగన్ పరిపాలనా పరంగా ముందడుగు వేశారు. 2019 మే 30న అధికారంలోకి వచ్చిన ఆయన అదే ఏడాది ఆగస్టు 15న వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పల్లెల్లో అయితే ప్రతి యాభై ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో అయితే సుమారుగా 50 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియమాకం జరిగింది. వాలంటీర్లు ఏం చేయాలో కూడా స్వయంగా జగన్ దిశానిర్దేశం చేశారు. ఇది సేవలాంటిదని, ఇది చేసుకుంటూనే వేరే ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చని, సర్టిఫికెట్ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సేవలకు తగిన ప్రాధాన్యత కూడా ఇస్తామని ఆరోజు జగన్ వారికి చెప్పారు. దీని తర్వాత వాలంటీర్ల ప్రాధాన్యత పరిపాలనా పరంగా బాగా పెరిగిందనే చెప్పాలి.
ప్రతినెల 1 తారీఖు రాగానే, సూర్యోదయం కాకముందే.. వాలంటీర్ ప్రతి గడపవద్దకు వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఏపీలో సంచలనంగా మారింది. గతంతో పోలిస్తే మార్పు స్పష్టంగా కనిపించిందని ఇక్కడ ఒప్పుకోక తప్పదు. ఆ తర్వాత పథకాలు అందించడంలోనూ, వారికి దరఖాస్తులు నింపడంలోనూ, అర్హుల ఎంపికలోనూ వాలంటీర్లు క్రూషియల్‌గా మారిపోయారు. తమ చేతిలో సెల్‌ఫోన్లతో లబ్ధిదారులకు కావాల్సిన అన్ని అవసరాలనూ ఇట్టే తీర్చే.. ఒక సైన్యంగా మారారు.
రెండేళ్లపాటు ప్రపంచాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టిన కరోనా కాలంలో వాలంటీర్ల సేవలు అందరి ప్రశంసలు పొందాయి. వరదలు లాంటి సమయంలోకూడా సాహసోతపేంగా పనిచేసిన వాలంటీర్లు జగన్ సర్కార్‌కు మంచిపేరే తీసుకువచ్చారు. మొత్తానికి జగన్ ప్రభుత్వానికి మైలేజీ రావడంలో వాలంటీర్ల ముఖ్యపాత్ర పోషించారు. వీరిని మరింత ప్రోత్సహించడానికి ప్రతిఏటా వారికి నగదు, మెడల్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అందించిన సేవలు చూస్తే.. రికార్డులు పెద్దగానే నమోదయ్యాయి. రూ. 2.24 లక్షల కోట్ల డబ్బును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయడంలో వాలంటీర్లు క్రూషియల్ రోల్ పోషించారు.. 7.25 కోట్లకు పైగా సేవలు అందించిన రికార్డుకూడా వాలంటీర్లకే చెందుతుంది. గ్రామ సచివాలయ వేదికగా అందే 540పైగా సేవల్లో వాలంటీర్ల రోల్ చాలా పెద్దది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా అమలు చేస్తున్న 26 డీబీటీ స్కీంల్లో వాలంటీర్లది కీలకపాత్ర. దీని ప్రకారం.. వాలంటీర్ వ్యవస్థ పాలనా పరంగా ఎంత కీలకంగా మారిందో ఉదాహరణగా చెప్పొచ్చు.
అయితే, రాజకీయాలు చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా, వర్గాలు చూడకూండా కేవలం అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించాలన్న జగన్ స్లోగన్‌ను తుచ తప్పక అందించడంలో వాలంటీర్లు విజయవంతం అయ్యారు. చివరకు వైయస్సార్‌సీపీకి చెందిన కేడరే వీరిపై కాస్త ఈర్ష్యను వ్యక్తంచేసిన సందర్భాలు లేకపోలేదు. తమ చేతిలో ఇంకేం లేదని, అంతా వాలంటీర్లు, గ్రామ సచివాలయాలకే వెళ్లిపోయిందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీకి చెందిన నేతలు బాహాటంగా వ్యక్తంచేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమైన సందర్భాలూ ఉన్నాయి.
53శాతం మంది మహిళా వాలంటీర్లే..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా ఉన్న సుమారు 15వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 2,62,483 మంది సేవలు అందిస్తుండగా, ఇందులో 53శాతం మంది మహిళా వాలంటీర్లే ఉన్నారు. రాజకీయనాయకుల ప్రమేయం లేకుండా.. ప్రతి ఇంటినుంచి కూడా ప్రభుత్వం తరఫున పనులను వీరంతా చక్కబెడుతున్నారు. ఇంత మహాసైన్యంలా మారిన వాలంటీర్ల వ్యవస్థపై అనతికాలంలోనే విమర్శలు మొదలయ్యాయి. మొదటగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్లు కాకరేపాయి. వాలంటీర్లు వచ్చి ఎవరూ లేని సమయంలో డోర్లు కొడతారంటూ చేసిన కామెంట్‌పై వాలంటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా వాలంటీర్లపై ప్రతిపక్షాలు పొలిటికల్ బాణాలను సంధిస్తూనే ఉన్నారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో వాలంటీర్ల ఎన్నికల వ్యవహారాలకు దూరంగా ఉండాలన్న ఈసీ ఆదేశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. సేవలు మాట అటుంచి.. రాజకీయంగా తమకు ఇబ్బంది కరంగా తయారయ్యారన్న భావన ప్రతిపక్షపార్టీల్లో మొదలైంది. దీనిలో భాగంగానే వాలంటీర్ల వ్యవస్థపై పవన్ కామెంట్లు చేసినట్టుగా భావిస్తున్నారు.
సహజంగా ఏదైనా పథకం కావాలాన్నీ దానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. పేరు, ఆధార్ నంబర్, ఆదాయం, కులం తదితర, వారికున్న భూమి తదితర వివరాలను పథకం పొందేవారు చెప్పాల్సి ఉంటుంది. దీన్నే సిక్స్ పాయింట్ వెరిఫికేషన్ అంటారు. ఈ వివరాల ఆధారంగా అర్హతలు నిర్దారిస్తారు. సహజంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఈ వివరాలు తీసుకోవడం సహజం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఇలాంటి వివరాలు ఇవ్వడం సహజం. కాకపోతే.. వాలంటీర్లు ఈ వివరాలు తీసుకుని, వాటిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్న కోణంలో ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్ ఈ విమర్శల్లో మరింతముందుకెళ్లి.. చేయరాని , చేయకూడని పనులు చేస్తున్నారంటూ ఘాటుగానే మాట్లాడటం ఇప్పుడు వివాదాస్పదమవ్వడంతోపాటు.. చర్చనీయాంశంగా మారింది.
వాలంటీర్ల వివరాల సేకరణలో రాష్ట్ర ప్రభత్వం రూపొందించిన యాప్‌లను వాడతారు. ఈ డేటా అంతాకూడా భద్రంగా ఉంటుందని, పూర్తి రక్షణ ఉంటుందని అధికారులు చెప్తు్న్నారు. సాధారణంగా బ్యాంకులు, క్రెడిట్‌కార్డులు, డెబిట్‌కార్డులు, ఇన్సూరెన్స్‌లు లాంటి సర్వీసులు పొందడానికి పౌరులు ఇచ్చే సమాచారం కన్నా .. వాలంటీర్లు ఎక్కువ సమాచారాన్ని ఏమీ తీసుకోరని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రయివేటు కంపెనీలు అయితే వివిధ రకాల ప్రైవేటుఏజెన్సీల సహాయంతో డేటాను తీసుకుంటారని, అప్పుడులేని భయాందోళనలు ఇప్పుడు ఇవిధ పార్టీలు వ్యక్తంచేయడంపైనా వారు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
ఇదే సమయంలో వైయస్సార్‌సీపీ ప్రతిపక్షాలపై దాడి పెంచింది. గత ప్రభుత్వం హయాంలో ఆధార్ డేటాను తస్కరించి.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలనూ లేవనెత్తుతోంది. ఐటీగ్రిడ్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తోంది. తమకు అలాంటి అవసరం లేదని, ప్రజల మద్దతుతో గెలుస్తామని అధికారపార్టీ అంటోంది. అయితే, ప్రతీ విషయంపై సందేహాలు వ్యక్తమవుతాయని.. వ్యవస్థపై ఇలాంటి విమర్శలు సహజమేనన్నది న్యూట్రల్ పీపుల్ నుంచి వస్తున్న వాదన. అయితే, ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండటం.. ప్రతిపక్షాలు వాలంటీర్లపై ఆరోపణలు చేయడం.. కూడా రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
గతంలో చంద్రబాబు కూడా..
ఇదిలాఉంటే.. గత చంద్రబాబు ప్రభుత్వంలో కూడా వాలంటీర్ల లాంటి వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ప్రతి యాభై మందికి సేవామిత్రను తీసుకురావాలని చివర్లో ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. కాని అప్పటికే ఉన్న జన్మభూమి కమిటీల పైన కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక పార్టీవారికే ఇస్తున్నారని, భారీగా లంచాలు తీసుకున్నారన్న అపవాదు గత ప్రభుత్వానికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటి వాలంటీర్ వ్యవస్థకూడా అవినీతి లాంటి ఆరోపణలు ఎదుర్కోకపోయినా.. కట్టడిచేస్తున్నారన్న విమర్శను ఎదుర్కొంటోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..