Andhra: కింద ఏమో ఇలా.. 3 అంతస్థుల పైన అలా.. ఆశ్చర్యం.. అద్భుతం..
హిందూ ధర్మంలో దైవత్వమున్న వృక్షాల్లో వేపచెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. వందేళ్ల వయసున్న వేపచెట్టును తొలగించకుండా, అదే చెట్టు చుట్టూ ఇల్లు కట్టిన ఒంగోలు కుటుంబం కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంటి మధ్యలో నుంచి చెట్టు పెరిగేలా మూడు అంతస్తుల మేడను నిర్మించగా..

హిందూ ధర్మశాస్త్రాల్లో చెట్లకు కూడా దైవత్వం ఉంటుందనేది ఓ నమ్మకం. పలు చెట్లను దేవతా వృక్షాలుగా పూజిస్తారు. అలాంటి వాటిల్లో తులసి, రావి, మారేడు, జమ్మి , పున్నాగ , మోదుగ చెట్లు ప్రధానమైనవి. వీటిని పూజిస్తే ఐశ్వర్యంతో పాటు శుభాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. అలాగే వేపచెట్టును ఇంటి పరిసరాల్లో పెంచడం, దానిని దైవంగా భావించి పూజించడం చేస్తుంటారు. వేపచెట్టు స్వచ్ఛమైన.. గాలిని అందించడమే కాకుండా క్రిమికీటకాలను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. అలానే శనీ, కేతు దోషాలను వేప చెట్టు నివారిస్తుందని చాలామంది నమ్ముతారు. అలాంటి వేపచెట్టును ఇంటిని నిర్మించేందుకు తొలగించాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అలానే ఒంగోలులోని ఓ కుటుంబం ఇల్లు కట్టేందుకు స్థలంలో అడ్డుగా ఉన్న వేపచెట్టును కూల్చకుండా.. చెట్టు చుట్టూ ఇల్లు కట్టి దాన్ని సంరక్షించి పూజలు చేస్తుండటం విశేషం. వందేళ్ల చరిత్ర కలిగిన వేపచెట్టును తొలగించకుండా ఇంటి నిర్మాణాన్ని చేపట్టి చెట్టుతో పాటే ఆ కుటుంబం నివసిస్తోంది.
హిందూ ధర్మంలో వేపచెట్టును లక్ష్మీదేవిగా, దైవిక శక్తులకు నిలయంగా భావిస్తారు. అందుకే తమ ఇల్లు నిర్మించాలనుకున్న స్థలంలో ఉన్న వందేళ్ల వయసు గల వేపచెట్టును తొలగించకుండా ఆ చెట్టు చుట్టూరా ఇల్లు కట్టి ఔరా… అనిపించిందో కుటుంబం. ఇంటి మధ్యలో చెట్టు వచ్చేలా మూడంతస్తుల మేడను నిర్మించారు… చెట్టు మొదలు గ్రౌండ్ ఫ్లోర్‌లో మొదలుకాగా.. చివర మూడో అంతస్థులో విస్తరించింది. మూడంతస్తుల పైన డాబా మీద నీడను ఇస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది ఆ చెట్టు. ఒంగోలులోని సాయిబాబు మందిరం ఎదురుగా ఉన్న జమ్మిచెట్టువీధిలో ఈ చెట్టును చుట్టిన ఇల్లు ఉంది. నగరానికి చెందిన రామచంద్రరావుకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన స్థలంలో.. వేపచెట్టు చుట్టూ ఇంటిని నిర్మించారు. కింద నుంచి పైకి ఎదిగిన చెట్టు మూడంతస్తులపై గొడుగులా నీడను ఇస్తోంది. వందేళ్లకు పైగా వయస్సు ఉన్న ఈ వేపచెట్టును తమ ఇంటి వేల్పుగా భావించి ఆ కుటుంబం పూజలు చేయడం విశేషం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




