RRR : రఘురామను అరెస్టు చేసిన కేసు కొత్త మలుపు.. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడీ అధికారులు అరెస్టు చేసిన కేసు కొత్త మలుపు తీసుకుంది...
NHRC on Narasapuram MP Raghu Rama Raju arrest case : నరసాపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడీ అధికారులు అరెస్టు చేసిన కేసు కొత్త మలుపు తీసుకుంది. తన తండ్రి.. ఎంపీ రఘురామరాజును ఏపీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన తీరు, తదనంతర పరిణామాలపై రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశారు. భరత్ ఫిర్యాదుపై స్పందించిన మానవహక్కుల సంఘం.. ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, కస్టడీలో రఘురామరాజుపై పోలీసుల దాడి విషయంలో అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. జూన్ 7లోగా నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఇలాఉండగా, ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రఘురామ రెండు రోజుల కిందట సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
అదే రోజున రఘురామకృష్ణరాజు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. మరుసటి రోజు ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఎయిమ్స్ పూర్తి స్థాయి కొవిడ్ ఆస్పత్రిగా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ ఎంపీ ప్రివిలేజ్, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆదేశాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు వైద్య సేవలందించారు. అనంతరం రఘురామరాజు ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి వెళ్లారు.