అన్న కంటే ముందే జనంలోకి షర్మిల.. జిల్లాల్లో షర్మిల సుడిగాలి పర్యటనలు..
కాంగ్రెస్ పార్టీ ఏపీ బాస్ వైఎస్ షర్మిల..విశాఖ వేదికగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను దాదాపుగా పూర్తి చేసిన సీఎం వైఎస్ జగన్ కూడా..విశాఖ నుండే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వేదికగా ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల.. గ్రౌండ్ లెవల్‌లో యాక్షన్ స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ జోడో యాత్రపై అసోంలో జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు. రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో మౌన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చిన షర్మిల..విశాఖలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు.
వైసీపీ సర్కారుపై ఇప్పటికే పదునైన విమర్శలు చేసిన షర్మిల..ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యాటనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది. తొలిరోజున శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో షర్మిల పర్యటిస్తారు. 24న విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతారు. 25న కాకినాడ, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు..26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు..27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు..28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు.. 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు..30న శ్రీ సత్య సాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు..31వ తేదీన నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపులపాయతో షర్మిల పర్యటన ముగుస్తుంది. ఈ పర్యటనలో జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించనున్నారు షర్మిల. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై చర్చిస్తారు.
వైసీపీ అభ్యర్ధుల ఎంపికను దాదాపు పూర్తి చేసిన సీఎం వైఎస్ జగన్..త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు షర్మిల కూడా జిల్లాల పర్యాటనకు శ్రీకారం చుట్టడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో పూర్తిగా స్తబ్ధత ఏర్పడింది. అధిష్ఠానం పలువురు పీసీసీ నేతలను మార్చినప్పటికీ పార్టీ కేడర్‌లో ఏమాత్రం ఉత్సాహం నింపలేకపోయారు. ఇప్పుడు వైఎస్ షర్మిల ఆ పరిస్థితిని మార్చి..ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తారని అధిష్ఠానం ఆశిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.