Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసుపై విచారణ.. న్యాయం చేయాలని వేడుకున్న సత్యంబాబు..
Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణకు బాధితుడు సత్యం బాబు తరఫున, జాతీయ మాల సంక్షేమ సంఘం

Ayesha Meera case: ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్‌లో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణకు బాధితుడు సత్యం బాబు తరఫున, జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ హాజరవగా.. పోలీసుల తరపున విజయవాడ డిఎస్పీ బి.వి సుబ్బారావు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో సత్యంబాబు మాట్లాడాడు. ఆయేషా మీరా హత్య కేసులో తనకు అన్యాయం జరిగిందని, దీనిపై 2017 లో ఎస్సీ కమిషన్ ను కలిసి పిటిషన్ ఇచ్చామని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ ను కోరానని తెలిపాడు. జైలులో ఉండటం వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులు పడిందని, పోలీస్ వ్యవస్థ తనపై క్రిమినల్ అనే ముద్ర వేయడం వల్ల తన కుటుంబం అనేక ఇబ్బందులు పడిందని ఎస్సీ కమిషన్ కు సత్యం బాబు తెలిపాడు. తనపై కేసు పెట్టి జైలుకు పంపడంతో తన తండ్రి కూడా చనిపోయారని, తన తల్లి మతి స్థిమితం కోల్పోయారని సత్యంబాబు వాపోయాడు. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కాలేదన్నారు.
ఎస్సీ కమిషన్ ముందు సత్యం బాబు వాదనలు గట్టిగా వినిపించామని బత్తుల రామ్ ప్రసాద్ తెలిపారు. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. అక్రమంగా కేసులు పెట్టి 9 ఏళ్ళు జైలులో ఉంచిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సత్యం బాబు కోరినట్లుగా రూ. 10 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. సత్యం బాబును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సత్యం బాబును ఆదుకోవడం పై ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతిని కలిసి సత్యం బాబుకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని బత్తుల రామ్ ప్రసాద్ తెలిపారు. నందిగామ వాస్తవ్యులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. సత్యంబాబుకు జరిగిన అన్యాయంపై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామన్నారు.
Also read:
Tight Dress Effects: టైట్‌గా ఉండే దుస్తులు ధరిస్తున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలిస్తే ఇక అలా చేయరు..!
Andhra Pradesh Politics: 33 ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టిన వైసీపీ.. ప్రత్యేక కథనం మీకోసం..!
Khammam MLC: టీఆర్ఎస్ పార్టీకి సవాల్‌గా మారిన అభ్యర్థి ఎంపిక.. ఒక సీటు కోసం ఆరుగురు పోటీ..!