RGV Vyuham: లోకేష్ డిఫమేషన్ నోటీస్.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న ఆర్జీవీ ‘వ్యూహం’..

ఆర్జీవీ వ్యూహం చుట్టూ ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తన పాత్రను అసభ్యంగా చిత్రీకరించారంటూ లోకేష్ డిఫమేషన్ నోటీస్ ఇస్తే.. వాటిని ట్విట్టర్‌లో పెట్టారు ఆర్జీవీ. మరోవైపు కమింగ్ సూన్ అంటూ చేసిన పోస్ట్.. ఆసక్తి రేపుతోంది. ఇంతకీ వ్యూహం సినిమాపై టీడీపీ వ్యూహం వర్కవుట్ అవుతుందా. ? సినిమాను అడ్డుకోవడం సాధ్యమేనా?

RGV Vyuham: లోకేష్ డిఫమేషన్ నోటీస్.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న ఆర్జీవీ ‘వ్యూహం’..
Rgv Vyuham
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 20, 2023 | 7:40 AM

ఆర్జీవీ వ్యూహం సినిమా.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిలీజ్ కాకుండానే ఈ సినిమా చుట్టూ రచ్చ రచ్చ జరుగుతోంది. లేటెస్ట్‌గా వ్యూహం డైరెక్ట‌ర్ ఆర్జీవీకి టీడీపీ నేత నారా లోకేష్ నోటీసులు ఇవ్వడంతో హాట్ టాపిక్‌గా మారింది. వ్యూహం సినిమాలో తన పాత్రను అసభ్యంగా చిత్రీకరించారంటూ డిఫమేషన్ నోటీసులు పంపించారు లోకేష్. ఆ నోటీసులు అందినట్టు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ఆర్జీవీ. ఇదే సమయంలో ఆర్జీవీ చేసిన మరో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది. కమింగ్ సూన్ అంటూ ఆర్జీవీ పోస్ట్ చేశారు.

వైఎస్‌ఆర్‌ మరణం తర్వాత నుంచి మొదలుకుని.. జగన్ మోహన్‌ రెడ్డి ఓదార్పు యాత్ర.. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాలను ఆర్జీవీ చిత్రీకరించారు. సినిమా పోస్టర్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ వరకూ అన్నీ సంచలనంగా మారాయి. సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, డైలాగులు రాజకీయాల్లో కాకరేపాయి. దీంతో ఈ సినిమా అటు సినీ ప్రేక్షకులతో పాటు, రాజకీయ నాయకుల్లో కూడా ఆసక్తి పెంచేసింది. అదే సమయంలో వివాదాలకు కేరాఫ్‌గా కూడా మారింది. చంద్రబాబును కించపరిచేలా.. టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌కు లోకేష్ లేఖ రాశారు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించేలా సినిమా ఉందనీ.. సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వొద్దంటూ లేఖ రాశారు.

ఎన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ నవంబర్ 10నే ఈ సినిమాను రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. వ్యూహం, శపథం పేరుతో రెండు పార్టులుగా విడుదల చేయాలని ప్రయత్నాలు చేసింది. కానీ సెన్సార్‌ బోర్డ్‌ అనుమతి లభించకపోవడంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. దీంతో రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లాయి వ్యూహం రీల్స్.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లైనా అనుమతి తెచ్చుకునే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్‌’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నట్లే తామూ తెచ్చుకుంటామని.. గతంలోనే ఆర్జీవీ ప్రకటించారు. ఇప్పుడు కమింగ్ సూన్ అంటూ ఆర్జీవీ పోస్ట్ చేయడం.. ఆ తర్వాత గంటకే నారా లోకేష్ నోటీసులు ఇచ్చినట్టు ప్రకటించడం ఆసక్తిగా మారింది. ఇంతకీ వ్యూహం సినిమాకు అనుమతులు వస్తాయా.. లేదంటే కోర్టుకు వెళ్లాల్సిందేనా?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..