Andhra News: ఒక్క మరణం.. నలుగురి చావుకు కారణం..! ఇంతకు ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది!
ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటే ఆ ఇంట్లో మాత్రం విషాదఛాయలు అలుముకున్నాయి. కొత్త సంవత్సరం నాడే ఓ తండ్రి తన కన్నకూతుళ్లు, కొడుకుకు విషం ఇచ్చి, అనంతరం అతను ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

కొత్త సంవత్సరం నాడు నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కంటికి రెప్పలా పెంచుకున్న తన ఇద్దరు కుమార్తెలకు, కొడుకుకు విషమిచ్చి ప్రాణాలు తీసిన తండ్రి.. అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌లకు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామానికి చెందిన వేములపాటి సురేంద్ర అనే వ్యక్తి తన పిల్లలు కావ్యశ్రీ (7), జ్ఞానేశ్వరి (4), సూర్య గగన్ (2) కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగించాడు. అయితే వారు ప్రాణాలు కోల్పోయిన కాసేపటికే.. అతను కూడా ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతని భార్య గత ఆగస్ట్ 15న అనారోగ్యం కారణంగా మృతి చెందింది. అప్పటి నుంచి పిల్లలను సురేంద్రనే చూసుకుంటున్నాడు.
భార్య మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేంద్ర మద్యానికి బానిసయ్యాడు. దానికి తోడు పిల్లల బాధ్యత, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే పిల్లలను చంపి అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాని, పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
