Nandyal: చుక్కల్లాంటి ముగ్గురు బిడ్డలను చంపి.. ఆపై తానూ.. కారణం ఏంటంటే..?
అభం–శుభం తెలియని ముగ్గురు పసి బిడ్డలను తండ్రే హతమార్చాడు. నాలుగు నెలల క్రితం భార్య ఆత్మహత్య, ఇప్పుడు తండ్రి దారుణం… ఒకే కుటుంబం కాలగర్భంలో కలిసిపోయిన ఘటన నంద్యాల జిల్లాలో విషాదాన్ని మిగిల్చింది. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం ..

కన్న తండ్రి కర్కశంగా మారాడు. అభం–శుభం తెలియని ముగ్గురు పసిబిడ్డలను హతమార్చి, అనంతరం తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు ముందు నాలుగు నెలల క్రితమే పిల్లల తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మొత్తం కుటుంబం కాలగర్భంలో కలిసిపోయింది. ఈ దారుణ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నెలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సురేంద్ర అనే వ్యక్తి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ, ధ్యానేశ్వరి, సూర్య గగన్‌లను హతమార్చిన అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సురేంద్ర భార్య నాలుగు నెలల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, అప్పట్లో కడుపునొప్పితో ఆమె మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య మృతి అనంతరం పిల్లలను పోషించలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో సురేంద్ర మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే రాత్రి సమయంలో తన ముగ్గురు పిల్లలను హతమార్చిన సురేంద్ర, అనంతరం తానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి చంపి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
