Montha Cyclone: దూసుకువస్తున్న మొంథా తుఫాన్.. ఈ జిల్లాలోని పాఠశాలలకు సెలవులు..
నేటి నుంచి నాలుగు రోజులు ఏపీకి రెయిన్ టెర్రర్!.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. తర్వాత తీవ్ర వాయుగుండంగా, తుఫానుగా బలపడబోతోంది. దీనికి మొంథా తుఫానుగా నామకరణం చేసింది IMD. బీ ఎలర్ట్ అంటోంది ఏపీ సర్కార్.. అంతేకాకుండా పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

ఏపీపైకి మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం.. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీవ్ర వాయుగుండం రూపాంతరం చెందబోతోంది. సోమవారం తుఫాన్‌గా.. మంగళవారం తీవ్ర తుఫాన్‌గా మారి విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక.. మంగళవారం సాయంత్రానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా.. మొంథా తుఫాన్ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు అలెర్ట్ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
రెడ్ అలర్ట్.. మొంథా తుఫాన్ ఏపీలోని ఏఏ జిల్లాలపై ప్రభావం చూపనుంది?..
మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని ఉత్తర-దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ ఆలర్ట్ జారీ ఇచ్చింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీయార్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
ఇక.. 28వ తేదీ తీవ్ర తుఫానుగా మారే సమయానికి ప్రభావం పెరిగి, వాన దంచి కొట్టబోతోంది. మొత్తం 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, ఉభయగోదావరి, కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. అల్లూరి, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. 29న తేదీ కూడా తుఫాన్ తీవ్రత కొనసాగనుంది. తుఫాన్ ప్రభావంతో గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
మరోవైపు.. IMD హెచ్చరికలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోస్తా జిల్లాల కలెక్టర్లందరూ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి జిల్లాకు ఇన్‌చార్జి అధికారులను నియమించి సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అటు.. తుఫాన్ దృష్ట్యా కాకినాడ కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పలు సూచనలు చేశారు. మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు
ఎన్టీఆర్ జిల్లాపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రేపటి నుంచి మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించగా.. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27, 28న సెలవు ప్రకటించారు. అంతేకాకుండా.. తుఫాన్ ప్రభావం దృష్ట్యా మరికొన్ని జిల్లాల్లోనూ సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.
మొంథా తుఫాన్ హెచ్చరికతో ఏపీ వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. NDRF, SDRF టీమ్‌లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. కలెక్టరేట్, RDO, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తంగా.. మొంథా తుఫాన్ హెచ్చరికలు ఏపీని భయపెడుతుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.
తెలంగాణలో వర్షాలు..
ఇదిలాఉంటే.. తెలంగాణలో కూడా వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
