AP Legislative council Chairman: ఏపీ శాసనమండలి ఛైర్మన్, డిఫ్యూటీ ఛైర్మన్ ఖాళీ.. ప్రొటెం చైర్మన్‌గా బాలసుబ్రహ్మణ్యం నియామకం
ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా వి.బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP Legislative council protem Chairman: ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా వి.బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి చైర్మన్, డిప్యూటి చైర్మన్ పదవీకాలం ఏకకాలంలో ముగియడంతో వి.బాలసుబ్రహ్మణ్యంను ప్రొటెం ఛైర్మన్‌గా నియమించారు. సోమవారం నూతన సభ్యులతో ప్రొటెం చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే, కొత్త చైర్మన్ ఎన్నిక అయ్యే వరకు ఈ పదవిలో బాలసుబ్రహ్మణ్యం కొనసాగనున్నారు. బాలసుబ్రహ్మణ్యం మూడు పర్యాయలు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ప్రాతినిథ్యం వహించారు.
ఇదిలావుంటే, గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి), ఆర్‌వీ రమేశ్ యాదవ్ (కడప), తోట త్రిమూర్తులును ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమేరకు గవర్నర్ విశ్వభూణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సోమవారం వీరి చేత ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గవర్నర్ కోటాలో నలుగురు వైసీపీ సభ్యులు మండలిలో చేరుతున్నారు. శుక్రవారంతో ఏడుగురు తెలుగుదేశం సభ్యులు, వైసీపీ నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయనున్నారు. అదే విధంగా నామినేటెడ్ కోటాలో టీడీపీ నుండి ముగ్గురు..వైసీపీ నుండి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో.. అప్పటి నుండి పెద్దల సభలో టీడీపీ సంఖ్యా బలం మొత్తం 58 స్థానాలకు గాను..15 మందికే పరిమితం కానుంది. దీంతో.. ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ బలం 20కి పెరిగనుంది.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి త్వరలో కొత్త ఛైర్మన్ ఎన్నికోనున్నారు. ఇప్పటి వరకు ఛైర్మన్ గా వ్యవహరించిన షరీఫ్ అహ్మద్ పదవీ విరమణ చేసారు. టీడీపీ హయాంలో 7 ఫిబ్రవరి 2019 న షరీఫ్ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన్నే కొనసాగించారు. మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లు.. సీఆర్డీఏ రద్దు బిల్లు విషయంలో నాడు ఛైర్మన్ తీరు పైన సీఎంతో సహా వైసీపీ అసహనం వ్యక్తం చేసినా.. ఆయనను తప్పించే ప్రయత్నాలు మాత్రం చేయలేదు. ఇక, మండలి నుంచి షరీఫ్ పదవీవిరమణ పొందడంతో మండలి ఛైర్మెన్ ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మండలి కొత్త ఛైర్మెన్ ఎంపిక కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో మండలి ఛైర్మన్..వైస్ ఛైర్మన్ గా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీలో మొదలైంది. శాసన మండలి ఛైర్మన్ గా ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీకి చెందిన షరీఫ్ కొనసాగటంతో ఆయన స్థానం రాయలసీమ ..మైనార్టీ నేత.. హిందూపురం కు చెందిన నాయకుడు..మాజీ ఐపీఎస్ అధికారి.. చంద్రబాబు కు భద్రతా అధికారిగా పని చేసిన ఇక్బాల్ వైపు సీఎం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2019 ఎన్నికల్లో ఆయనకు హిందూపూర్ సీటు ఇచ్చారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ కట్టబెట్టారు. ఈ మధ్యనే మరోసారి ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ నిర్ణయించారు. 2027 మార్చి 29 వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉండనున్నారు.
ఇక, డిప్యూటీ ఛైర్మన్ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత ..వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న జంగా క్రిష్ణమూర్తికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు వైసీపీ నుండి శాసన మండలికి నామినేట్ కానుండటంతో.. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే మినహా మండలి ఛైర్మన్.. వైస్ ఛైర్మన్ల విషయంలో వీరికే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరి.. ముఖ్యమంత్రి జగన్ ఈ నియామకాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Read Also…. APPSC: హైకోర్టు జోక్యంతో నిలిచిపోయిన గ్రూప్ 1 ఇంటర్వ్యూలు..అయోమయం..ఏపీపీఎస్సీ పరీక్షల తీరు..!