MLC Sheikh Sabji Died: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హఠాన్మరణం.. ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం (డిసెంబర్ 15) దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకువాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు..
ఏలూరు, డిసెంబర్ 15: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ శుక్రవారం (డిసెంబర్ 15) దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకువాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు.
భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఏలూరు నుంచి కారులో వచ్చిన ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన కారు డ్రైవర్, గన్‌మెన్, పర్సనల్ అసిస్టెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అత్యవసర వాహనంలో హుటాహుటీన భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన సమయంలో షేక్ సాబ్జీ సీటు బెల్ట్ ధరించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదం ధాటికి అతని ఛాతీ, తలపై తీవ్రమైన గాయాలు అవ్వడంతో దుర్మరణం చెందినట్లు తెలిపారు. ఏఎస్సై సూర్యనారాయణ, ఎంపీడీవో కొండలరావు, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల పలువురు కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో సాబ్జీ మరణం పట్ల మంత్రివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. సాబ్జీ మృతి పట్ల కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి, సంతాపం తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.