పాములు పగ పడతాయా..? 103 సార్లు ఒకే వ్యక్తిని కాటేసిన పాములు.. ఇదో మిస్టరీ కథ..
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాముకాటు సమస్య వేధిస్తోంది. పగబట్టి కాటేస్తుందా లేదంటే ప్రమాదవశాత్తు పాముకాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాముకాటు సమస్య వేధిస్తోంది. పగబట్టి కాటేస్తుందా లేదంటే ప్రమాదవశాత్తు పాముకాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. ఇలా వింత సమస్యతో సతమతం అవుతున్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నా.. సుబ్రమణ్యం ఇప్పటివరకు 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు.. అవును.. అన్ని సార్లు కూడా పాము కాటుకు గురై.. ఆసుపత్రి పాలై చికిత్స పొందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
నిరుపేద కూలీ సుబ్రహ్మణ్యం కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. అయితే.. ఆయన్ను వదలకుండా పాములు వెంటాడుతూ కాటేస్తూ ఉండటం సంచలనంగా మారింది. 18 ఏళ్ల వయసులో తొలిసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం.. అయితే.. ఏ సర్ప దోషం ఉందో తెలియదు కానీ పాములు మాత్రం అతనిపై పగతో రగిలి పోతూనే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
సుబ్రహ్మణ్యం ఏ పొలంలో ఉన్నా.. ఎక్కడ పనిచేస్తున్నా అక్కడికి వెతుక్కుంటూ వస్తున్న పాములు.. అతనికి ప్రత్యక్షమై కరుస్తుండటం వింతగా మారింది. ఇలా ఏకంగా 103 సార్లు పాము కాటుకు గురయ్యాడు.. నాగుపాముతో పాటు వివిధ రకాల విష సర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం చికిత్స అనంతరం కోలుకున్నట్లు తెలిపాడు. పాము కాటుకు గురికావడం, ఆ వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావడం, కోలుకోవడం తరచూ ఇలా జరుగుతూనే ఉంది.
ప్రస్తుతం పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యం.. పెద్దపంజాణి మండలం శివాడి గ్రామ సమీపంలోని జెఎంజె మిషనరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. పాముకాటుకు అలా నాటువైద్యం పొందుతున్న సుబ్రహ్మణ్యం ఎంతటి విష సర్పం కరిచినా మృత్యుంజయుడుగానే డిశ్చార్జ్ అవుతున్నాడు. ఇలా ఏకంగా పాముకాట్లలో సెంచరీ కొట్టిన సుబ్రహ్మణ్యం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
అయితే.. తరచూ పాములు కరుస్తుండటం.. ఆసుపత్రి పాలవుతుండటంతో.. సుబ్రహ్మణం.. భార్యా ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని పోషించడానికి నానా అవస్థలు పడుతున్నాడు. పాము కాటుకు గురైన ప్రతి సమయంలోనూ వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక, కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతున్నట్లు సుబ్రమణ్యం తెలిపాడు..

103 Snake Bites
మూడు రోజుల క్రితం కూడా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామం సమీపంలోనే ఉన్న కోళ్ల ఫారం లో పని కోసం వెళ్లిన సుబ్రహ్మణ్యం ను పాము కాటేసింది. దీంతో ముచ్చటగా 103వ సారి పాముకాటుకు గురైన సుబ్రమణ్యంను భార్య, గ్రామస్తులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అపాయం నుంచి బయట పడ్డాడు.. సుబ్రహ్మణ్యంకు వైద్యం అందించే ఆసుపత్రి సిబ్బంది కూడా దయతో వైద్యం అందిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇలా ఒంటి నిండా పాముకాట్లకు గురై తరచూ ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న సుబ్రహ్మణ్యంను.. ఆసుపత్రి యాజమాన్యం కాస్త దయ తలచి వైద్య ఖర్చులు కూడా తక్కువగానే తీసుకుంటోంది.. అయితే.. సుబ్రహ్మణ్యంనే పాములు ఎందుకు కాటేస్తున్నాయో తెలియక కుటుంబసభ్యులు తలలు పట్టుకుంటున్నారు.. సుబ్రహ్మణ్యంను పాములు ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి.. ఎందుకు అన్ని సార్లు కాటేశాయి ..? అనేది అంతుచిక్కని మిస్టరీగా మారిపోయింది.
గమనిక: పాములు పగబడతాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.. మేము విశ్వసించడం లేదు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..