AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migratory Birds: కొల్లేరులో విదేశీ పక్షుల సందడి.. సరస్సుకు కొత్త అందాలు.. పక్షి ప్రేమికులకు కనువిందు

కొల్లేరులో అధిక సంఖ్యలో కనిపించే విదేశీ పక్షులు స్పాట్ బిల్డ్ పెలికాన్. పిలిఫ్పైన్స్ దేశంలో పుట్టిన విహంగమే అయినా ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొల్లేరులోనే ఎన్నో ఏళ్లుగా ఉంటోంది. స్థానికంగా దీనిని గూడ బాతు అని పిలుస్తుంటారు. ఇవి వేటాడే విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆకాశంలో విహరించడమే కాకుండా సాధారణ బాతులా నీటిలో గంటల తరబడి ఈదుతూ వేటాడుతుంది.

Migratory Birds: కొల్లేరులో విదేశీ పక్షుల సందడి.. సరస్సుకు కొత్త అందాలు.. పక్షి ప్రేమికులకు కనువిందు
Migratory Birds At Kolleru
M Sivakumar
| Edited By: Surya Kala|

Updated on: Nov 12, 2023 | 8:59 AM

Share

కొల్లేరు మంచి నీటి సరస్సులో విదేశీ పక్షాలు సందడి చేస్తున్నాయి. పచ్చని చెట్లపై వలస పక్షులు చేస్తునటువంటి విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కొల్లేరు నివాస యోగ్యంతో పాటు సహజ మత్స్య సంపదకు ఆలవాలంగా ఉండటంతో వేల కిలోమీటర్ల నుంచి ఏటా ఇక్కడికి వస్తుంటాయి. అక్టోబరు నెలాఖరు నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఆటపాక వలస పక్షుల కేంద్రం పక్షి ప్రేమికులతో సందడిగా మారుతుంది.

కొల్లేరులో అధిక సంఖ్యలో కనిపించే విదేశీ పక్షులు స్పాట్ బిల్డ్ పెలికాన్. పిలిఫ్పైన్స్ దేశంలో పుట్టిన విహంగమే అయినా ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొల్లేరులోనే ఎన్నో ఏళ్లుగా ఉంటోంది. స్థానికంగా దీనిని గూడ బాతు అని పిలుస్తుంటారు. ఇవి వేటాడే విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆకాశంలో విహరించడమే కాకుండా సాధారణ బాతులా నీటిలో గంటల తరబడి ఈదుతూ వేటాడుతుంది.

కొల్లేరు వచ్చే పక్షి జాతుల్లో విశిష్టత కలిగిన పక్షులు పెయిండెడ్ స్టార్క్. ఎర్ర కాళ్ల కొంగగా స్థానికులు పిలుచుకుంటారు. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారినట్లు వర్ణశోభితంగా ఉంటాయి. ఇంద్ర ధనుస్సులోని రంగులన్నీ దీని దేహంపై ఉంటాయి. దీని విన్యాసాలు, వేటాడే విధానం, శరీరాకృతి చూస్తే చూపు తిప్పుకోలేం.

ఇవి కూడా చదవండి

విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే పక్షులు మనుగడ సాగించేలా ఆటపాక వలస పక్షుల కేంద్రం(పిట్టల దొడ్డి)లో 260 ఎకరాల్లో చెరువు ఏర్పాటు చేశారు. పక్షులు నివాసం ఉండేందుకు వీలుగా మట్టి దిమ్మెలు ఏర్పాటు చేసి చెట్లు పెంచారు. వీటితో పాటు సరస్సు మధ్యలో పక్షులు గూళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటుచేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అధికారులు పక్షుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

శీతాకాలంలో కొల్లేరుకు విదేశాల నుంచి వచ్చే పక్షుల రాక కోసం పక్షి ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. అనుకూల వాతావరణంతో పాటు ఆహారం, సంతానోత్పత్తికి 120 రకాల విదేశీ పక్షి జాతులు ఏటా ఇక్కడి కొస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, యూరప్, సైబీరియా వంటి 24 దేశాల నుంచి గ్రేట్ వైట్ పెలికాన్, పెయిండెడ్ స్టార్క్, జెయింట్ ఐబీస్ వంటి పక్షులు వేలాదిగా ఇక్కడికి చేరుకుని సంతానోత్పత్తి అనంతరం తిరిగి స్వదేశాలకు పయనమవుతుంటాయి

ఆటపాక పక్షుల కేంద్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని పక్షులు వచ్చే అవకాశం ఉంది. వీటి కోసం ప్రత్యేకంగా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. వాటికి అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..