AP Local Body Elections:అసుపత్రి బెడ్ టు సర్పంచ్ సీటు..4 ఓట్లతో మరొకరు గెలుపు.. పంచాయితీ పోరులో సిత్రాలెన్నో!

ఏపీ పంచాయితీ ఎన్నికల సిత్రాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. దేనికదే వెరైటీ.. దేనికదే సాటి. నరాలు తెగె ఉత్కంట ఒక చోట వుంటే.. అనాయాసంగా గెలిచి సర్పంచ్ సీటెక్కిన వారూ వుండడం విశేషం.

  • Rajesh Sharma
  • Publish Date - 6:33 pm, Mon, 22 February 21
AP Local Body Elections:అసుపత్రి బెడ్ టు సర్పంచ్ సీటు..4 ఓట్లతో మరొకరు గెలుపు.. పంచాయితీ పోరులో సిత్రాలెన్నో!

Many gimmicks in Panchayath polls:  ఏపీ పంచాయితీ ఎన్నికలైతే ముగిసాయి కానీ.. ఎన్నికల సిత్రాలు మాత్రం ఇంకా వెలుగు చూస్తూనే వున్నాయి. ఎన్నికలన్నాక సిత్రాలకు కొదవేం వుండదు. కానీ ఆ నోటా.. ఈ నోటా పడి వెలుగు చూడ్డంలోనే కాస్త వెనకా ముందూను. సరిగ్గా అలాంటివే తాజాగా ఒకటి గుంటూరు జిల్లాలో బయట పడితే.. మరొకటి పశ్చిమ గోదావరి జిల్లాలో వెల్లడైంది. రెండూ దేనికదే వెరైటీ కానీ.. పంచాయితీ ఎన్నికలను రంజుకెక్కించడంలో మాత్రం దేనికదే సాటి. ఇంతకీ ఎంటా సిత్రాలనే కదా మీ డౌటానుమానం? చదివేయండి మరి..!

గెలుపోటముల దోబుచులాట

అబ్బబ్బబా..! ఏం ఎలెక్షన్స్..? నరాలు తెగే ఉత్కంఠ. గెలుపు రెండు పార్టీల మద్దతుదారులతో దోబుచులాడింది. అభ్యర్థులకైతే టెన్షన్ నషాళానికెక్కేలా చేసింది. గెలుపు వైసీపీది అంటే… కాదు కాదు టీడీపీది అన్నారు. ముచ్చటగా మూడోసారి కౌంటింగ్ జరిపారు. ఫైనల్‌గా ఏం తేలింది. అదే కదా మజా అంటే.. మొత్తానికి గెలుపోటముల దోబూచులాట రెండు ప్రధాన పార్టీల శ్రేణులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. ఇంతకీ ఇదెక్కడ? అంటారా.. దశాబ్ధాలుగా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన గుంటూరు జిల్లాలో. రాజకీయ కక్షలకు నెలవైన పెదకూరపాడులో.

ఆంధ్రప్రదేశ్ లోనే విస్తీర్ణంలో అతి పెద్ద నియోజకవర్గం పెదకూరపాడు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రసరవత్తంగా మారతాయి. ఇటీవలి పంచాయతీ ఎన్నికలు కూడా అదే స్థాయిలో జరిగాయి. గెలుపు నువ్వా? నేనా? అన్నట్లుగా పోటా పోటీగా కౌంటింగ్ కొనసాగింది. మేజర్ పంచాయతీ అయిన పెదకూరపాడులో మొత్తం ఓట్లు 9,894. ఇందులో పోలైన ఓట్లు 7,992. టీడీపీ మద్దతుదారుగా బరిలో నిలిచిన గుడిపూడి రాజుకి 3,809 ఓట్లు వచ్చాయి. మరోవైపు వైసీపీ మద్దతుదారు తాళ్లూరి మహాలక్ష్మి తక్కువేం తినలేదు. ఆమెకు 3,805 వచ్చాయి. ఒక దశలో రెండు ఓట్లతో మహలక్ష్మి గెలిచినట్లు ప్రకటించారు. ఇంకేముంది అంతా సంబరాలు జరుపుకున్నారు. కుంకుమలు కొట్టుకున్నారు. ఇది టీడీపీ శ్రేణులకు రుచించలేదు. కౌంటింగులో ఏదో మతలబు జరిగిందంటూ రీ కౌంటింగ్ పెట్టాల్సిందేనంటూ పట్టుపట్టారు. ఇందుకు వైసీపీ నేతలు ఒప్పుకోలేదు. అయితేనేం అధికారులు రీకౌంటింగ్ చేసేందుకు ముందుకొచ్చారు. రెండో సారి కౌంటింగ్ పూర్తయిన తర్వాత టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థికి నాలుగోట్లు ఎక్కువొచ్చాయి కాబట్టి అతనే విజేత అని తేల్చారు. సహజంగానే దీనిని వైసీపీ వర్గాలు ఒప్పుకోలేదు.

అందుకే మరోసారి కౌంటింగ్ జరపాలని వైసీపీ శ్రేణులు పేచీ పెట్టారు. అధికార పార్టీ పట్టు బడితే ఆఫీసర్లు మాత్రం కాదనగలరా? అదే పని చేశారు. ముచ్చటగా మూడోసారి ఓట్ల లెక్కింపు చేపట్టారు. చివరాఖరికి మళ్లీ టీడీపీ నేతకే నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చాయని తేల్చారు. దాంతో టీడీపీ మద్దతిచ్చిన రాజు గెలిచినట్లుగా అధికారులు ప్రకటించారు. ఆ సంగతి తెలుసుకున్న వైసీపీ నేతలు నిరాశకు గురయ్యారు. నాలుగోసారి కౌంటింగ్ చేయాలని పట్టుపట్టినా అధికారులు ఒప్పుకోలేదు. ఇలా గంట గంటకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య అర్థరాత్రి వరకు చివరకు తెల్లారే వరకు సాగింది కౌంటింగ్. నియోజకవర్గ కేంద్రంపెదకూరపాడు టీడీపీ పరం కావడంతో వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు షాక్ ఇచ్చినట్లు అయింది. నియోజకవర్గంలోని మెజార్టీ పంచాయతీలు వైసీపీ వశం కావడంలో కీలక పాత్ర పోషించారు ఎమ్మెల్యే. కానీ ఆయన వ్యూహాలు పెదకూరపాడులో పని చేయక పోవడం హాట్ టాపికైంది. ఓడితే ఓడారు కేవలం నాలుగంటే నాలుగే ఓట్ల తేడాతో ఓడిపోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. అందులో రెండు ఓట్లు అటు ఇటు వచ్చినా సమానంగా వచ్చేది అంటూ చర్చించుకోవడం కనిపించింది. ఇదిలా వుండగా పెదకూరపాడులోనే పోటీ చేసిన చావా ప్రసాద్ బాబుకు 48, పగటి రాజు 49 ఓట్లు వచ్చాయి. ఇక నోట కింద ఇక్కడ 38 ఓట్లు రావడం గమనార్హం. ఇక్కడ పోలైన ఓట్లల్లో తిరస్కరించబడినవి 243 ఉన్నాయి.

ఆస్పత్రి నుంచే గెలుపు

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేశారు నల్లమోలు శ్రీనివాస రామావతారం. ఊరు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పుల్లాయిగూడెం. జనసేన మద్దతుతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేశాక నల్లమోలు శ్రీనివాస రామావతారానికి ఆరోగ్యం దెబ్బతింది. హఠాత్తుగా వచ్చిన బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆస్పత్రి పాలయ్యారు. కాస్త కోలుకుని అక్కడి నుంచే వీడియో సందేశం ద్వారా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు రామావతారం. కానీ పరిస్థితి ఇంకా విషమించడంతో పోలింగ్ రోజు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. ఇటువైపు పోలింగ్ ముగిసింది. కౌంటింగ్ చేపట్టారు. చివరకు రామావతారం 82 ఓట్ల మెజార్టీతో విజేతగా నిలవడం హాట్ టాపికైంది. ఈ గెలుపును ఆస్వాదించడానికైనా రామావతారం కోలుకుని తమ ముందుకు రావాలని ఓటర్లు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తమ వంతుగా ప్రయత్నిస్తున్నారు.

Also Read: ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. షాకింగ్ విషయమేంటంటే?

Also Read: ఆయుధ సంపత్తిలో దూసుకెళ్తున్న భారత్.. సామర్థ్యం తెలిస్తే షాకే!