Andhra Pradesh: గొడవ ఆపేందుకు మధ్యలో వెళ్లినందుకు తోసేశారు.. రన్నింగ్ ట్రైన్‌లో దారుణం..
అనంతపురం జిల్లాలో దారుణం..రైల్లో సీటు కోసం గొడవ పడుతున్న వారికి నచ్చచెప్పిన వ్యక్తిని ట్రైన్ లో నుంచి తోసేసిన సంఘటన గుత్తి రైల్వే జంక్షన్ సమీపంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది... ప్రమాదంలో అన్నమయ్య జిల్లా కుమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

అనంతపురం జిల్లా, జూన్ 16: గుత్తి రైల్వే జంక్షన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. సీట్ కోసం ఘర్షణ పడుతున్న వారికి సర్ది చెప్పిన పాపానికి అతని ట్రైన్ లో నుంచి తోసేసిన సంఘటన గుత్తి సమీపంలో అర్ధరాత్రి జరిగింది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కుమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రమేష్ కుమార్ అనే యువకుడు పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనంతపురం రైల్వేస్టేషన్ క్రాస్ తర్వాత తోటి ప్రయాణికులు సీటు కోసం ఘర్షణ పడుతుండగా వారికి సర్దిచెప్పాడు. ఎందుకు గొడవ పడతారు నెక్స్ట్ స్టేషన్ లో ఖాళీ అయితే కూర్చోవచ్చు అంటూ నచ్చ చెప్పిన పాపానికి మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి తనను డోర్ లో నుంచి తోసేసినట్టు బాధితుడు రమేష్ తెలిపాడు.
తాను మొలకలచెరువులో రైలు ఎక్కానని హైదరాబాద్ వెళ్తుండగా అనంతపురంలో ఇద్దరు వ్యక్తులు ఎక్కారని వారు మద్యం మత్తులో ఉండి సీటు కోసం గొడవ పడుతుండగా వారికి సర్ది చెప్పి నెక్స్ట్ వచ్చే స్టేషన్లో ఎక్కవచ్చు అంటూ డోర్ దగ్గరికి వచ్చి కూర్చుని ఉండగా మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి తనను కాలుతో తన్ని తోసేసినట్టు బాధితుడు తెలిపాడు. రైలు నుండి కిందపడిన సమయంలో రమేష్ కు రెండు కాళ్లు పూర్తిగా నుజ్జు నుజ్దు అయ్యాయి.. అయితే కింద పడిన సుమారు గంటపాటు రమేష్ ముళ్లపదలో పడిపోయాడు.
అనంతరం తన సెల్ ఫోన్ నుండి 108కి సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ,108 అక్కడికి వెళ్లి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరీక్షించిన వైద్యులు సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు తరలించారు. ఈ సంఘటనపై గుత్తి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం
