AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!

విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రేంగరువు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడుతూ ఆమెపై దాడి చేస్తున్న పోలయ్యకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన నేగలి గంగులు (45) హత్యకు గురయ్యాడు. ఆగ్రహానికి గురైన పోలయ్య కోడిని కోసేందుకు తెచ్చుకున్న కత్తితో గంగులు ఛాతిపై పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు..

భార్యాభర్తల గొడవలో జోక్యం.. సర్దిచెప్పబోయిన వ్యక్తి దారుణ హత్య!
Man Stabbed To Death For Trying To Stop Husband And Wife Dispute
Srilakshmi C
|

Updated on: Oct 17, 2026 | 10:21 AM

Share

విజయనగరం, అక్టోబర్ 17: భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవను ఆపి, వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆడవారిని కొట్టడం తప్పంటూ ప్రశ్నించినందుకు ఆగ్రహించిన భర్త కత్తితో దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన గంట్యాడ మండలంలోని దిగువకొండపర్తి పంచాయతీ పరిధిలో ఉన్న రేంగరువు గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

రేంగరువు గ్రామానికి చెందిన నేగలి పోలయ్య గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో కోడి విషయమై తన భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఆమెపై దాడి చేశాడు. అక్కడే ఉన్న నేగలి గంగులు (45) ఈ ఘటనను గమనించాడు. మహిళను కొట్టడం తప్పని చెబుతూ పోలయ్యకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. గంగులు తనను ప్రశ్నించడంపై పోలయ్య ఆగ్రహానికి గురయ్యాడు. కోడిని కోసేందుకు తెచ్చుకున్న కత్తితో గంగులు ఛాతిపై బలంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో గంగులు అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్లముందే జరిగిన ఈ దారుణంతో గ్రామస్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

ఘటనపై సమాచారం అందుకున్న గంట్యాడ ఇన్‌ఛార్జి సీఐ శ్రీనివాసరావు, ఎస్సై లక్ష్మణరావు క్లూస్‌టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, గ్రామస్థులను విచారించి వివరాలు సేకరించారు. మృతుడి మొదటి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పోలయ్య పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మృతుడు గంగులుకు ఇద్దరు భార్యలు, ఎనిమిది మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

Follow Us