AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం, మహానందిలో వైభవంగా దసరా ఉత్సవాలు.. కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లు!

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరవ రోజైన శుక్రవారం మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారు, శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీశైలం, మహానందిలో వైభవంగా దసరా ఉత్సవాలు.. కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లు!
Grand Dasara Celebrations At Srisailam And Mahanandi Templeles
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Oct 17, 2026 | 8:30 AM

Share

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం శ్రీ కామేశ్వరి అమ్మవారు కాత్యాయని దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

ఈ సందర్భంగా ఆలయ మాడ వీధుల్లో అమ్మవారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఉత్సవాలు వైభవంగా సాగాయి. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

అమ్మవారికి ఉత్సవాలకు సంబంధించిన వీడియో చూడండి..

శ్రీశైలంలో కన్నులపండువగా పుష్పపల్లకి సేవ

మరోవైపు శ్రీశైలం మహాక్షేత్రంలోనూ దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. నవరాత్రుల్లో ఆరవ రోజైన శుక్రవారం శ్రీ భ్రమరాంబికా దేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హంసవాహనంపై కొలువుదీరిన శ్రీస్వామి-అమ్మవార్లకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు.

విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో కాత్యాయని అలంకారంలోని అమ్మవారు, శ్రీస్వామివారు గ్రామోత్సవానికి తరలుతుండగా.. ఉత్సవం ముందు నాదస్వరం, కేరళ చండీ మేళం, కోలాటం, కొమ్ము కోయ నృత్యం, రాజభటుల వేషాలు, పలు రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం ముందు పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిలో శ్రీస్వామి-అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కటాక్షించారు.

గంగాధర మండపం నుంచి ప్రారంభమైన ఈ గ్రామోత్సవం అంకాలమ్మ గుడి, నంది మండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు కన్నులపండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో శ్రీశైల క్షేత్రమంతా శివనామస్మరణతో మారుమోగింది. ఈ పూజా కైంకర్యాలు, పుష్పపల్లకి సేవలో ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us