AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

సుప్రీంకోర్టులో 10వ తరగతి అర్హతతో జూనియర్ కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాలు పొందే అవకాశం వచ్చింది. మొత్తం 130 గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 బేసిక్‌ జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? సుప్రీంకోర్టులో 130 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!
Supreme Court JCA Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 17, 2026 | 9:33 AM

Share

సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా.. గ్రూప్‌-సి నాన్‌-క్లెరికల్‌ కేడర్‌లో జూనియర్‌ కోర్ట్‌ అటెండెంట్‌ (JCA) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంటర్‌ వరకు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన భారతీయ పౌరులు నవంబర్‌ 4, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామక ప్రక్రియ ద్వారా 130 జూనియర్‌ కోర్ట్‌ అటెండెంట్‌ (గ్రూప్‌-సి నాన్‌-క్లెరికల్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం పదో తరగతి (10వ తరగతి) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌లో గరిష్ఠ విద్యార్హతను ఇంటర్‌ (10+2)గా పేర్కొన్నారు.

అలాగే 2026 అక్టోబర్‌ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 25, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌/అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మాజీ సైనికులు/దివ్యాంగులు రూ.750 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును బ్యాంకు ఛార్జీలతో కలిపి ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే చెల్లించాలి. జూనియర్‌ కోర్ట్‌ అటెండెంట్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమిక వేతనం నెలకు రూ.21,700 చెల్లిస్తారు. దీనికి అదనంగా నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు అందుతాయి.

ఉద్యోగ విధులు ఏమిటి?

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు కార్యాలయ నిర్వహణకు సంబంధించిన వివిధ పనులు చేయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి: ఫైళ్లు, రికార్డులను ఒకచోటు నుంచి మరోచోటుకు తరలించడం. టేబుళ్లు, కుర్చీలను శుభ్రం చేయడం. అధికారులు, ఇతర సిబ్బందికి టీ, కాఫీ, స్నాక్స్‌, నీరు అందించడం. కార్యాలయానికి సంబంధించిన ఇతర సహాయక విధులను నిర్వహించడం.

ఇవి కూడా చదవండి

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ పరీక్షలో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 25 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. పరీక్ష వ్యవధి గంటన్నర. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. కనీస అర్హత మార్కులు 50. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు మొత్తం 25 మార్కులు కేటాయించారు. ఇందులో కనీస అర్హత మార్కులు 13.

ముఖ్యమైన వివరాలు..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్‌ 4, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 25, 2026.
  • ఆబ్జెక్టివ్‌ పరీక్ష తేదీ: డిసెంబర్‌ 26, 2026 (తాత్కాలికంగా)
  • మొత్తం ఖాళీలు: 130
  • పోస్టు పేరు: జూనియర్‌ కోర్ట్‌ అటెండెంట్‌ (JCA)
  • విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత
  • గరిష్ఠ విద్యార్హత: ఇంటర్‌ (10+2)]
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
  • ఉద్యోగ సంస్థ: సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా

సుప్రీంకోర్టులో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us