AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మా ఆవిడకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!’ మంత్రిపై భర్త ఆరోపణ

ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య, ఆమె భర్త గిర్ధారీ లాల్ సాహు మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై శారీరక దాడి, వేధింపులు, హత్య బెదిరింపులకు పాల్పడ్డారని రేఖా ఆర్య భర్తపై ఫిర్యాదు చేయగా.. ఆమె రూ.210 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టారని సాహు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని సీఎం పుష్కర్ సింగ్ ధామిని కోరారు..

'మా ఆవిడకు రూ.210 కోట్ల అక్రమాస్తులు ఉన్నాయ్.. అరెస్ట్ చేయండి!' మంత్రిపై భర్త ఆరోపణ
Husband Alleges On Uttarakhand Minister Rekha Arya
Srilakshmi C
|

Updated on: Oct 17, 2026 | 10:52 AM

Share

డెహ్రాడూన్, అక్టోబర్ 17: ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య, ఆమె భర్త గిర్ధారీ లాల్ సాహు మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై శారీరక దాడి, వేధింపులు, చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారని రేఖా ఆర్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే.. ఆమెపై సాహు సంచలన ఆరోపణలు చేశారు. రేఖా ఆర్య రూ.210 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ, దీనిపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిని కోరారు. అయితే, తన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి పత్రాలను ఆయన సమర్పించలేదు. తన కుటుంబ వివాదం నేపథ్యంలో విడుదల చేసిన వీడియోలో గిర్ధారీ లాల్ సాహు.. రేఖా ఆర్యపై వచ్చిన ఆరోపణలపై తగిన దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరారు. అదే సమయంలో తనపై రేఖా ఆర్య చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెనక్కి తీసుకోవాలని, తన గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రిని కోరారు.

రేఖా ఆర్య గురువారం సాయంత్రం విడుదల చేసిన ఆడియో రికార్డింగ్‌ను సాహు నకిలీదిగా అభివర్ణించారు. అది కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన కల్పిత ఆడియో అని, కుటుంబంలో విభేదాలు సృష్టించేందుకు దాన్ని ప్రచారం చేశారని ఆరోపించారు. రేఖా ఆర్య రాజకీయ జీవితంలో తాను కీలక పాత్ర పోషించానని గిర్ధారీ లాల్ సాహు పేర్కొన్నారు. సుమారు 17 ఏళ్లపాటు ఆమె ఎన్నికల ప్రచారాలను నిర్వహించానని, ఓట్లు అభ్యర్థించానని తెలిపారు. గతంలో తన సహకారంతోనే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారని, ప్రస్తుతం అధికారంలో ఉన్నందుకు అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీవితంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, పదవులు శాశ్వతం కావని ఆయన వ్యాఖ్యానించారు. తనపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోకపోతే తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వీడియోలో హెచ్చరించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

భర్తపై రేఖా ఆర్య ఎఫ్‌ఐఆర్

మరోవైపు, తన భర్త గిర్ధారీ లాల్ సాహు తనపై శారీరక దాడికి పాల్పడ్డారని, వేధించారని, కులం పేరుతో దూషించారని, చంపేస్తానని బెదిరించారని రేఖా ఆర్య ఆరోపించారు. ఈ మేరకు అక్టోబరు 15న డెహ్రాడూన్‌లోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసి తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. ఈ కేసులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అఘాయిత్యాల నిరోధక చట్టం (SC/ST Prevention of Atrocities Act)లోని మూడు సెక్షన్లతో పాటు సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పీటీఐ నివేదించింది. ఈ వివాదంపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గణేశ్ గోదియాల్ స్పందించారు. రేఖా ఆర్య విడుదల చేసిన వీడియో చూసి తీవ్రంగా కలత చెందానని తెలిపారు. మహిళా సాధికారతకు సంబంధించిన శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తే వేధింపులకు గురవుతున్నానని చెబుతుండటం రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

రేఖా ఆర్యకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, మహిళల రక్షణ కోసం తమ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని చెప్పారు. అంకితా భండారి కేసు నుంచి రేఖా ఆర్య వివాదం వరకు మహిళల పరిస్థితిపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయని గోదియాల్ పేర్కొన్నారు. ఒకవైపు తన భర్తపై రేఖా ఆర్య తీవ్రమైన ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించగా, మరోవైపు ఆమెపై అక్రమ ఆస్తుల ఆరోపణలు చేసిన సాహు విచారణకు డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే, ఇరువైపులా చేసిన ఆరోపణలు ఇంకా దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ వివాదంపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Follow Us