Ganesh Chaturthi: ఏపీ అంతా ఒక రూల్.. ఆ ప్రాంతంలో మాత్రం వింత రూల్.. విగ్రహం పెడితే.. కేసు బుక్కైనట్టే..
Vinayaka Chavithi 2022: వినాయక చవితికి గణపతి విగ్రహం పెడుతున్నారా? అయితే, ఈ రూల్స్ పక్కాగా పాటించాల్సిందే! లేదంటే, కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏపీ పోలీసులు.
Ganesh Chaturthi 2022: ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి ఉత్సవాలపై పోలీసులు గైడ్‌లైన్స్ జారీ చేశారు. స్టేట్‌వైడ్‌గా గణేష్ ఉత్సవ కమిటీలకు ఆదేశాలు ఇచ్చారు. వినాయక చవితికి భారీ విగ్రహాలను పెడితే రూల్స్ పక్కాగా పాటించాల్సిందేనంటూ సూచించారు. లేదంటే, కేసులు తప్పవని హెచ్చరించారు. ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే పూర్తిగా కమిటీయే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సౌండ్ సిస్టమ్స్‌కి కూడా అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీసులు తెలిపారు. పర్మిషన్ తీసుకున్నా, ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఉండాలన్నారు. అయితే, కర్నూలు జిల్లా దేవనకొండలో ఏకంగా వినాయక చవితి ఉత్సవాలపైనే ఆంక్షలు విధించారు. తమ అనుమతి లేకుండా ఎవరైనా బహిరంగంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
దేవనకొండలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న సమాచారం మేరకే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మొహరం సందర్భంగా ఘర్షణలు జరిగాయని, లా అండ్ ఆర్డర్ ప్రోబ్లామ్ వచ్చిందని, అలాంటి పరిస్థితి రాకూడదనే బహిరంగ చవితి ఉత్సవాలపై నిషేధం విధించినట్లు ప్రకటించారు. ఎవరైనా పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి, విగ్రహాలను ప్రతిష్టించడం, ఊరేగింపుగా తీసుకెళ్లడం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.