AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh:నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పత్తికొండ ఎమ్మెల్యే.. ప్రజాసమస్యల పరిష్కారానికి కొత్త కాన్సెప్ట్

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెడ్‌ బుక్‌, వైట్‌ బుక్‌ అంటూ... రాష్ట్రమంతా రాజకీయదుమారం రేగుతున్న వేళ... ప్రజాసమస్యల పరిష్కారం కోసం కంప్లయింట్‌ బుక్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పుస్తకం

Andhra Pradesh:నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన పత్తికొండ ఎమ్మెల్యే.. ప్రజాసమస్యల పరిష్కారానికి కొత్త కాన్సెప్ట్
MLA K E Shyam Babu
Ram Naramaneni
|

Updated on: Sep 30, 2024 | 9:44 PM

Share

కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు.. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. రెడ్‌ బుక్‌, వైట్‌ బుక్‌ అంటూ… రాష్ట్రమంతా రాజకీయదుమారం రేగుతున్న వేళ… ప్రజాసమస్యల పరిష్కారం కోసం కంప్లయింట్‌ బుక్‌ అనే కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పుస్తకం… అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటే, సాధారణ జనానికి మాత్రం భారీ ఊరటనిస్తోందట. సాధారణ జనం ఎవరైనా సరే, ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నా, లేకున్నా .. ఆఫీసులో ఉంచిన ఫిర్యాదుల పుస్తకంలో… తమ సమస్యను రాసి వెళ్లిపోవచ్చు. తానొచ్చాక, ఆ పుస్తకంలో అంశాలను ఒక్కొక్కటిగా ఆరా తీస్తున్న ఎమ్మెల్యే శ్యాంబాబు… వారిని పిలిపించి మరీ సమస్య వివరాలను తెలుసుకుంటున్నారు. వెంటనే పరిష్కారమూ చూపుతున్నారు. అయితే, బాధితులను ఇబ్బంది పెడుతున్నది సొంత పార్టీ నేతలైనా వదలట్లేదట ఎమ్మెల్యే.

తనవాళ్లు తప్పుచేసినా ఒప్పుకోనంటున్న ఎమ్మెల్యే

పత్తికొండ నియోజకవర్గం… అత్యంత వేడుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉంటుంది. ఇలాంటి చోట ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన కేఈ శ్యాంబాబు.. ప్రజాసమస్యలపై చేసిన ఈ కొత్త ఆలోచన.. పెద్ద మార్పునకే కారణమవుతోంది. తన కార్యాలయంలో కంప్లయింట్‌ బుక్‌ను ఏర్పాటుచేయడమేకాదు.. ఆ సమస్యకు తనవాళ్లు కారణమని తెలిసినా చర్యలు తీసుకుంటానంటూ సభాముఖంగా చెప్పారు. మొదట్లో అందరూ… ఇదంతా మామూలులే అనుకున్నారు. కానీ, బుక్కులో బాధితులు రాసిన సమస్యలు చూసి.. వాటికి కారణమైన సొంత పార్టీ నేతలపై కూడా చర్యలు తీసుకోవడమే కాదు, అధికారులనూ మందలించడం.. ఇక్కడి జనాల్లో నమ్మకం కలిగేలా చేసింది. స్పాట్‌..

అవినీతిపై అధికారులకూ గట్టి వార్నింగ్‌

ఎమ్మెల్యే అంటే మంత్రిలా హడావుడి చేస్తున్న ఈ రోజుల్లో.. ఎస్కార్ట్‌ కూడా అవసరం లేదంటూ, సింపుల్‌గా పోలీసులను వారిస్తున్న శ్యాంబాబు… సాదాసీదాగా ఉంటున్నారట. తన వెనకాల పదైదు కార్లేసుకుని అనుచరులు వస్తున్నా… అలా రావొద్దు మీ పనులు మీరు చూస్కోండంటూ.. వెనక్కి పంపించేస్తున్నారట. ఇవన్నీ గమనిస్తున్న పత్తికొండ జనం… మామంచి ఎమ్మె్ల్యే అంటూ శ్యాంబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. పత్తికొండ టు హైదరాబాద్‌ బస్‌ ఫెసిలిటీ కల్పించడంటూ.. ఫిర్యాదుల పుస్తకంలో ఓ ఓటరు మెన్షన్‌ చేస్తే… టపీమనీ బస్సును బస్టాండ్‌లో నిలబెట్టేశారట ఎమ్మెల్యే. వీధిలైట్లు, కొళాయిలు, రోడ్లు… ఇలా ఒకేటమిటి… అన్ని సమస్యలకూ సత్వర పరిష్కారం చూపుతూ షభాష్‌ ఎమ్మెల్యే అనిపించుకుంటున్నారట శ్యాంబాబు. రెవెన్యూ సిబ్బంది ఒకరు లంచంకోసం డిమాండ్‌ చేస్తున్నారని తెలిసి.. వెంటనే ట్రాన్స్‌ఫర్‌ చేయించిన ఎమ్మెల్యే… అలాంటివి ఇక్కడ కుదరవ్‌ అంటూ… అధికారులకు కూడా వార్నింగ్‌ ఇచ్చారంట.

గుట్కా, మట్కా, పేకాట బంద్‌!

నియోజకవర్గంలో శాంతిభద్రతలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ఎమ్మెల్యే… మట్కా ,గుట్కా, పేకాట, ఫ్యాక్షన్.. ఇవేమీ లేకుండా చూస్తున్నారట. గతంలా కాదు… పత్తికొండ మారాలి, ఇతర నియోకవర్గాలకు ఆదర్శంగా ఉండాలి అనే కాన్సెప్ట్‌తో ముందుకెళ్తున్నారట. అయితే, ఎమ్మెల్యే తీరు సొంత పార్టీలో కొందరికి నచ్చకున్నా… ప్రత్యర్థులకు మింగుడు పడకున్నా… వెరైటీగా ఉన్నప్పటికీ ఈ కంప్లయింట్‌ బుక్‌ కాన్సెప్ట్‌ అదిరిపోయిందనే టాక్‌ వినిపిస్తోంది రాజకీయవర్గాల్లో. మున్ముందు ఇది ఇంకెన్ని కొత్త పుంతలు తొక్కుతుందో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..