Kurnool: ఆ నియోజకవర్గం నాదే.. పార్టీ నేతల ప్రకటనలతో TDP శ్రేణుల్లో గందరగోళం
Kurnool TDP: కర్నూలు జిల్లాలో ఒకే రోజు వేర్వేరు సందర్భాల్లో టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు జిల్లా రాజకీయాలను కుదిపేశాయి.
కర్నూలు జిల్లాలో ఒకే రోజు వేర్వేరు సందర్భాల్లో టీడీపీ నేతలు చేసిన ప్రకటనలు జిల్లా రాజకీయాలను కుదిపేశాయి. ఆలూరులో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, డోన్ లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ విడివిడిగా పర్యటించారు. వాస్తవానికి ఆలూరు టిడిపి ఇన్చార్జిగా కోట్ల సుజాతమ్మ వ్యవహరిస్తున్నారు. అయితే కేఈ ప్రభాకర్ తాను ఆలూరు లేదా కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఆలూరు టీడీపీ ఇన్చార్జి కోట్ల సుజాతమ్మ, కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాను ఆలూరు నుంచే పోటీ చేస్తానని కోట్ల సుజాతమ్మ ఇప్పటికే ప్రకటించగా.. సూర్యప్రకాశ్ రెడ్డి కూడా కర్నూలు ఎంపీగానే పోటీ చేస్తానని ఎమ్మెల్యేగా పోటీ చేయనని ఇది వరకే బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మిగనూరులో ఎంపీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
నిన్ననే కోట్ల సుజాతమ్మ డోన్‌లో పర్యటించడం తెలుగుదేశం పార్టీలో కాక రేపింది. ఇటీవలే అంటే నెల రోజుల క్రితమే ధర్మవరం సుబ్బారెడ్డి ని డోన్ టిడిపి ఇన్చార్జిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అటు ఆలూరు లో 2014 లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ తాను టిడిపి నుంచి మళ్లీ పోటీ చేస్తానని అక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నేతలు భిన్నమైన ప్రకటనల పట్ల టీడీపీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై కార్యకర్తలు కూడా అయోమయం నెలకొంది. ఎవరికివారు తానే పోటీ చేస్తానని, ఫలానా చోట నుంచి పోటీలో ఉంటానని బహిరంగంగా చెబుతుండటం టిడిపిలో క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోంది. దీనిపై పార్టీ అధినేత గట్టి నిర్ణయం తీసుకోకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
(నాగి రెడ్డి, కర్నూలు జిల్లా, టీవీ9)
Also Read..