AP News: ఈ కుర్రోడు మాములోడు కాదు.. 3 వేలతో మ్యాజిక్ బైక్ రూపొందించాడు..
టాలెంట్ ఎవడి సొత్తు కాదు. సరిగ్గా బుర్ర పెట్టాలి కానీ అద్భుతాలు చేయొచ్చు. అందుకు వయస్సు, పేదరికం కూడా అడ్డుకాదు. తాజాగా ఆ విషయాన్ని తన చేతలతో మరోసారి ప్రూవ్ చేశాడు ఈ కర్నూలు కుర్రాడు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

కర్నూలు, జులై 18: కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు కర్నూలుకి చెందిన ఓ విద్యార్థి. ఓ పక్క చదువుకుంటూనే ఏదైనా సాధించాలన్న తపనతో తన మేధస్సుకి పని పెట్టాడు. గతంలో ఓ బైక్ మెకానిక్ షెడ్ లో పని చేసిన అనుభవం ఉండటంతో దాని పైనే ప్రయోగం చేసాడు. తన మేధస్సుతో తక్కువ ఖర్చుతో సైకిల్ మోడల్ బైక్‌ను తయారు చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన శాంతిరాజు, రత్నమ్మకు ముగ్గురు పిల్లలు. వీరిలో చిన్న కొడుకు అయినా రాకేష్ గత సంవత్సరం పదవ తరగతి పూర్తి చేసుకుని ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం ముంబై కి వెళ్ళగా అక్కడికి రాకేష్‌ని కూడా తీసుకెళ్లారు. ముంబైలో రాకేష్ కొన్ని రోజులపాటు ఓ మెకానిక్ షెడ్డులో పనిచేశాడు. ఆ తర్వాత సొంత గ్రామానికి వచ్చిన రాకేష్ చదువుకుంటూనే తాను నేర్చుకున్న కొద్దిపాటు పనితో ఏదో ఒకటి చేయాలని సంకల్పం పెట్టుకున్నాడు. అలా ఆలోచన చేసి.. తండ్రి శాంతి రాజును అడిగి ఓ పాత సైకిల్‌ను కొనుగోలు చేసి, తరువాత కొన్ని పాత సామాన్ల దుకాణాలకు వెళ్లి.. అక్కడ దొరికిన ద్విచక్ర వాహన సామాన్లు కొనుగోలు చేసాడు. సుమారు 20 రోజుల పాటు శ్రమించి ఆ పాత సైకిల్‌కు.. బైక్ ఇంజన్ సెట్ చేశాడు.. ఆపై బైక్ సైకిల్‌ను రయ్యమంటూ రోడ్లపై తీసుకొచ్చాడు. ఇది చూసిన గ్రామస్తులు రాకేష్‌ను ఎంతో అభినందించారు. తల్లితండ్రులు సైతం రాకేష్ ఇలాంటి ప్రయోగం విజయవంతంగా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ వాహనం తయారు చేయడానికి కేవలం 3 వేల రూపాయలు ఖర్చు అయిందని, తనకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే తాను తక్కువ ఖర్చులో ఓ బైక్ ను కుడా రూపొందించగలనని రాకేష్ నమ్మకంగా చెబుతున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
