Andhra Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. పండంటి బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి కాసేపటికే షాక్
కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వచ్చిన మహిళ మెడలోని మూడున్నర తులాల తాళిబొట్టు ఉన్న బంగారు గొలుసును దొంగలు దోచుకున్నారు.
కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. డెలివరీ కోసం వచ్చిన మహిళ మెడలోని మూడున్నర తులాల తాళిబొట్టు ఉన్న బంగారు గొలుసును దొంగలు దోచుకున్నారు. నందికొట్కూరు మండలం జంగం పాడు గ్రామానికి చెందిన రవి భార్య అపర్ణ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చింది. రాత్రి డెలివరీ చేసేందుకు థియేటర్లోకి తీసుకెళ్లారు. డెలివరీ కోసం తీసుకెళ్లేటప్పుడు ఆమె మెడలో బంగారు గొలుసు ఉంది. కానీ ఈ తెల్లవారుజామున మగ బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం.. వార్డుకు తీసుకొచ్చినప్పుడు ఆమె మెడలో చైన్ కనిపించలేదు. దీంతో కచ్చితంగా ఆసుపత్రి సిబ్బందే.. డెలివరీ థియేటర్‌లో బంగారు గొలుసుకు దొంగిలించి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై బాధితురాల కుటుంబీకులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇంత దారుణమా బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. తక్షణమే దొంగలను పట్టుకొని తమ బంగారు గొలుసు ఇప్పించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటి ఆధారంగా తాళిబొట్టు కలిగిన బంగారు గొలుసును కొట్టేసిన దొంగలను పట్టుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అటు ఆసుపత్రి అధికారులు కానీ పోలీసులు కానీ ఇంకా స్పందించడం లేదు.
ఈ ఘటనతో ఆస్పత్రిలోని ఇతర పేషెంట్స్ కూడా ఆందోళనకు గురవుతున్నారు. తమ విలువైన వస్తువులు ఎక్కడ దొంగతనానికి గురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో దొంగతనాలు పునరావృతంకాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
(నాగిరెడ్డి, కర్నూలు జిల్లా, టీవీ9 తెలుగు)
Also Read..
Viral Video: ఒక్కసారిగా బస్సు మీదికొచ్చిన గజరాజు.. ఆందోళనలో ప్రయాణికులు.. డ్రైవర్ ఏం చేశాడంటే..?