Kurma Fire Accident: ఆధ్యాత్మిక నగరి కూర్మ గ్రామంలో అసలేం జరిగింది..? ఎస్పీ కీలక ప్రకటన..
కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం వివాదం రాజేస్తోంది. ఫైర్ యాక్సిడెంట్‌పై అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే అగ్నిప్రమాదంలో కుట్ర కోణం దాగి ఉందా? ఈఘటనపై స్థానికులు ఏమంటున్నారు? పోలీస్‌ల రిపోర్ట్ ఏం చెబుతోంది? . ఈప్రమాదంపై డిప్యూటీ సీఎం ఏమన్నారు? ఆయన ఆదేశాలేంటో చూద్దాం.

ఆధ్మాత్మిక నగరి.. సరళ జీవనం.. ఉన్నత చింతనం. పరవశించే శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం అలజడికి దీపమే కారణమా? అంటే అవుననే అంటున్నారు శ్రీకాకుళం జిల్లా పోలీసులు. ఆధ్యాత్మిక కేంద్రం కూర్మ గ్రామంలో ఈనెల 10 మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఎంక్వైరీ చేసిన పోలీసులు.. ఎటువంటి దురుద్దేశం లేదని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదంపై అల్లరి మూకలు ప్రమేయం లేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఆధ్యాత్మిక మందిరంలో కూర్మ గ్రామ సభ్యులు ప్రతిరోజు దీపాలు వెలిగించి పూజ చేసుకున్న తర్వాత దీపాలు ఆర్పి వేసి వెళ్లి పోతారు. ఏదైనా దీపం పొరపాటున పూర్తిగా ఆగకపోయి ఉండడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఘటనపై ఇప్పటికే ప్రమాద స్థలంలో భౌతిక ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడకు పంపామన్నారు. ఘటనకు దీపాల వలన జరిగిన అగ్ని ప్రమాదమే ప్రధాన కారణమని, అవాస్తవాలు వదంతులు ప్రజలు ఎవరూ నమ్మవద్దని, అవాస్తవాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి తెలిపారు.
అయితే కూర్మ గ్రామంలోని ఆధ్యాత్మిక హరేకృష్ణ మఠం వారు మాత్రం అగ్నిప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సొసైటీలో జరుగుతున్న మోసాన్ని తాము ప్రజలకు తెలియచేస్తుండడంతో తమపై కుట్రలు చేస్తున్నారని చెప్తున్నారు. అగ్నిప్రమాదం ముమ్మాటికి కుట్రేనంటున్నారు. రానురాను కూర్మ గ్రామంలో జరిగే అనేక ప్రయోగాలను అడ్డుకునేందుకే ఇలాంటి ఘటనలు సృష్టించారని తెలిపారు.
అన్ని కోణాల్లో లోతుగా విచారణ చేయాలి: పవన్ కల్యాణ్
కూర్మ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ అయ్యారు. కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదం దురదృష్టకరమన్నారు. అగ్ని ప్రమాదంపై లోతుగా విచారణ చేయాలని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. కూర్మ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలని సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు. మరోవైపు ఇప్పటికే కూర్మగ్రామాన్ని బీజేపీ నేతలు సందర్శించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అటు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఇవాళ జనసేన నేతలు సైతం కూర్మ గ్రామంలో పర్యటించనున్నారు. అగ్నిప్రమాదంపై స్థానికులను అడిగి తెలుసుకోనున్నారు. ఫైర్ యాక్సిడెంట్‌లో పర్ణశాల పూర్తిగా కాలిపోయింది. అందులోని వస్తు సామాగ్రి, స్వామివారి విగ్రహం, వేద పుస్తకాలు, విలువైన గ్రంథాలు సైతం కాలి బూడిదయ్యాయి. పర్ణశాల పైకప్పు, చుట్టూ ఉండే ఫెన్సింగ్ గడ్డి, కట్టెలు, దూలాలతో నిర్మించడంతో నిప్పు అంటుకోగానే క్షణాల్లో అంతటా మంటలు వ్యాపించాయి. స్థానికులు ఘటన స్థలానికి చేరి మంటలను అదుపు చేసే క్రమంలోనే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
