AP News: కుప్పంలో సైకిల్ స్పీడ్‌‌కు ఫ్యాన్ ఖాళీ.!

కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో కుప్పం వైసీపీ నాయకులు టీడీపీకి గూటికి చేరుతున్నారు. తాజాగా మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

AP News: కుప్పంలో సైకిల్ స్పీడ్‌‌కు ఫ్యాన్ ఖాళీ.!
Kuppam Constituency Ycp Leaders Are Joining In The Tdp
Follow us
Raju M P R

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 07, 2024 | 8:34 PM

కుప్పం నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాకా అన్న సంగతి తెలిసిందే.. 1989 నుంచి కుప్పంలో ఇప్పటి దాకా ఓటమి ఎరగని నేతగా చంద్రబాబు కొనసాగుతున్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత కుప్పంలో టీడీపీ పని అయిపోయిందన్న ప్రచారాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వైసీపీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2024 ఎన్నికలు జరిగిన నాలుగు నెలల లోపే వైసీపీ ప్రాబల్యం తగ్గపోతుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో దూకుడును ప్రదర్శించి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వై నాట్ 175 అనే నినాదం వైసీపీ ఎత్తుకుంది.

కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీపీలను, కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న వైసీపీకి రాష్ట్రంలో జరిగిన అధికార మార్పు నాలుగు నెలల్లోనే కుప్పంలో సీన్ రివర్స్ అయ్యేందుకు కారణమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని మెజారిటీని సాధించడం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో కుప్పంలో వైసీపీ అని చెప్పుకునేందుకు లీడర్లు ముందుకు రావడం లేదు. కొందరు అజ్ఞాతంలోకి వెళితే మరికొందరు పార్టీ కండువా మార్చాల్సి వచ్చింది. మరికొందరిపై కేసులు నమోదు కావడంతో జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇలా కుప్పంలో వైసీపీ ఖాళీ కాగా మిగిలిన మరికొందరు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో కుప్పం ఇలాకాలో చంద్రబాబుకు మరోసారి తిరుగు లేదని తేలిపోయింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసిన సుధీర్ భవిష్యత్తుకు చంద్రబాబు భరోసా కూడా ఇచ్చారని తెలిసింది. దీంతో మరికొందరు ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ‌లోని మరికొందరు నేతలు టీడీపీలో చేరుతున్నారు. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కుప్పం వైసీపీ ఇంఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ నియోజకవర్గానికి రాకపోవడంతో పార్టీ కేడర్ ఆందోళనలో ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి