Krishna District: ‘పద్దతి మార్చుకోండి.. లేదంటే తాట తీస్తాం..’ రౌడీ షీటర్లకు కృష్ణా జిల్లా పోలీసుల సీరియస్ వార్నింగ్
తోట సందీప్ హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో రౌడీ షీటర్లపైన విజయవాడ పోలీసు కమిషనర్ డేగ కన్ను పెట్టారు. అతి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తోట సందీప్ హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో రౌడీ షీటర్లపైన విజయవాడ పోలీసు కమిషనర్ డేగ కన్ను పెట్టారు. అతి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా తగ్గుముఖం పట్టినా నేపథ్యంలో నిఘా కఠినం చేయాలని సూచించారు. నేరాలకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం సిఐ శ్రీధర్ కుమార్ రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. మండలంలో మొత్తం 54 మంది రౌడీ షీటర్లు ఉండగా వారిలో ఎంతమంది అందుబాటులో ఉన్నారు, ఎంతమంది ఇతర ప్రాంతాలకు వెళ్లారనే విషయంపైన నగర పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. అయితే గత కొంతకాలంగా కరోనా సందర్భంగా పోలీసులు లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రౌడీ షీటర్లపైన నిఘా కొరవడింది. అన్ లాక్ నేపధ్యంలో ఇక నుంచి ప్రత్యేకంగా కొంతమంది కానిస్టేబుళ్లను కేటాయించి రౌడీ షీటర్లపైన ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు సిఐ శ్రీధర్ కుమార్ తెలిపారు.
రౌడీ షీటర్ల కదలికలపైన ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. రౌడీ షీటర్లు, నేరాలకు పాల్పడినా లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏడాది పొడవునా మంచి ప్రవర్తన కలిగిన రౌడీ షీటర్లపైన షీటు తొలగించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ లు రమేష్, శ్రీనివాసు, మణి, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: ప్రేమకు అంగీకరించలేదని.. యువతిని గంజాయి కేసులో ఇరికించాడు.. చివరకు