ప్రేమకు అంగీకరించలేదని.. యువతిని గంజాయి కేసులో ఇరికించాడు.. చివరకు
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. వారిని ముందుకు తీసుకువెళ్లడం పక్కనబెడితే.. వారి మానాన వారిని కూడా బ్రతకనివ్వడం లేదు. ప్రేమ పేరుతో దాడులు....
సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. వారిని ముందుకు తీసుకువెళ్లడం పక్కనబెడితే.. వారి మానాన వారిని కూడా బ్రతకనివ్వడం లేదు. ప్రేమ పేరుతో దాడులు, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు.. ఇలా నిత్యం అనేక వార్తలను మనం చదువుతూనే ఉన్నాం. తాజాగా తన ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ ప్రబుద్ధుడు సినిమా రేంజ్‌లో స్కెచ్ వేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. తన ప్రేమను కాదన్న యువతిని ఏకంగా జైల్లోనే పెట్టించాలనుకున్నాడు. గంజాయి కేసులో ఇరికించి ఆమెను మానసికంగా ఇబ్బందిపెట్టాడు. ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువనంతపురంలోని వళుతకాడ్లో ‘వీవర్స్ విలేజ్’ పేరుతో బిజినెస్ రన్ చేస్తున్నారు శోభా విశ్వనాథ్. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్తల్లో ఆమె ఒకరు. ఆమెకు తిరువనంతపురంలోని లార్డ్స్ హాస్పిటల్ సీఈఓ హరీశ్ హరిదాస్‌తో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు హరీశ్. అందుకు ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి హరీశ్‌ను కాస్త దూరం పెట్టింది. దీంతో శోభపై కోపం పెంచుకున్న హరీశ్.. ఆమెను కటకటాలపాలు చేయాలనుకున్నాడు. పక్కా స్కెచ్ వేశాడు. ఆమె దగ్గర పనిచేసే వివేక్ రాజ్ అనే వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జనవరి 21న, యువతికి చెందిన షాపులో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మాదక ద్రవ్యాల అక్రమ నిల్వ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు పెద్ద యుద్ధమే చేశారు ఆమె. ఈ కేసును సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు.
కేసును దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్.. శోభా విశ్వనాథ్‌ను నిర్దోషిగా తేల్చారు. ఆమె షాప్‌లో కావాలనే గంజాయి ఉంచి.. కేసులో ఇరికించారని గుర్తించారు. ఆమెపై ఉన్న అన్ని ఆరోపణలను నిజమైనవి కావని పేర్కొన్నారు.
Also Read: రోజురోజుకు రసవత్తరంగా మారుతన్న ‘మా’ ఎన్నికలు.. అధ్యక్ష బరిలో మరో నటుడు