కోనసీమ కొబ్బరి రైతులకు కలిసొచ్చిన రామనవమి! ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా ఎగుమతులు
కోనసీమలో వరి తర్వాత అధికంగా పండించే కొబ్బరికి ఉగాది, శ్రీరామనవమి పండుగల సమయంలో డిమాండ్ పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీ ఆర్డర్లు వస్తున్నాయి. కానీ, కూలీల కొరత, లారీల కొరత వంటి సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. తమిళనాడులో దిగుబడి తగ్గడం కూడా కోనసీమ కొబ్బరికి డిమాండ్ పెరగడానికి కారణం.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి పంట తరువాత అధికంగా వుండే పంట కొబ్బరి. అలాంటి కొబ్బరికి జనవరి తరువాత మంచి ధర ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో నుంచి ఆశించిన మేర ఆర్డర్లు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు సన్నగిల్లాయి. కానీ, ఉగాది, శ్రీరామనవమి పండుగల నేపథ్యంలో రైతులు, వ్యాపారులకు ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు రావడంతో ఆనందంగా ఉన్నప్పటికీ మరో పక్క కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. శ్రీరామ నవమి పండుగను దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహించుకోనున్న నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కోనసీమ వ్యాపారులు, రైతులకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా కోనసీమ కొబ్బరి మార్కెట్ ఊపందుకుంది.
గతేడాది ఇదే సమయంలో 20 నుంచి 25 లారీల ఎగుమతులు జరగగా, ప్రస్తుతం కోనసీమతోపాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి 100 లారీలకు పైగా ఎగుమతులు జరుగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ తోపాటు ఈ ఏడాది జమ్ముకాశ్మీర్ రాష్ట్రం నుంచి భారీగా ఆడర్లు వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉగాది సందర్భంగా కర్ణాటకలో గుడిపావడా పండుగను వైభవంగా నిర్వహిస్తారు. అక్కడ కొబ్బరికాయలను ఈ పండుగకు ఎక్కువగా వినియోగిస్తారు. దీంతో ఆ రాష్ట్రానికి కొబ్బరి ఎగుమతులు జోరుగా సాగుతున్నాయి. అలాగే కోల్ కత్తాలో ప్రతి అమావాస్యకు ఆ ప్రాంత ప్రజలు కొబ్బరిని ఎక్కువగా వినియోగిస్తారు.
ఈ ఏడాది శివరాత్రికి భారీగా ఆర్డర్లు వస్తాయని భావించిన రైతులకు శివరాత్రికి అశించినంత మేర ఆర్డర్లు లేకపోవడంతో రైతుల వద్దే కొబ్బరికాయల రాశులు నిలిచిపోయాయి. అయితే పండగలు పూర్తయినప్పటికీ ఎండలు పెరగడం వల్ల కూడా ప్రస్తుతం కొబ్బరి ఎగుమతులు భారీగా జరుగుతున్నాయని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కొబ్బరి దిగుబడి తగ్గడం ఇక్కడ ఎగుమతులు ఊపందుకోవడానికి మరో కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా శ్రీరామనవమి ప్రభావంవల్ల ఈస్థాయిలో ఎగుమతులు జరుగుతున్నాయి అంటున్నారు.
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడం లేదనే చందంగా మారింది కోనసీమలో కొబ్బరి రైతులు, వ్యాపారుల పరిస్థితి. కోనసీమ కొబ్బరి మార్కెట్లో ఎగుమతులు ఊపందుకున్నప్పటికీ ఒలుపు కార్మికులు, లోడింగ్ కూలీలు, లారీల కొరత వేధిస్తుండడంతో రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్లను సకాలంలో అందించలేకపోతున్నారు. దీనికితోడు లోడింగ్ చేసేవారు, లారీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో కొంతమంది వ్యాపారులు ఆర్డర్లు వచ్చినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్డర్లను సకాలంలో అందించలేకపోతున్నామంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.