Visakhapatnam: అరకు కాఫీలో అంత మత్తు ఉందా..? జీ20 నేతలకు గిఫ్ట్‌గా ఇండియన్ ఫ్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్.. ఎక్కడ, ఎలా తయారవుతుందంటే..
Andhra Pradesh: ఇండియా లో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుంటే , అందులో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆయిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే అధికం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ది చెందిన అరబికా రకం కాఫీ పండుతుంది. ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ ప్రారంభం అయింది.
విశాఖపట్నం, సెప్టెంబర్15: ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన జి20 సదస్సులో పాల్గొన్న ప్రపంచ దేశాల నేతలకు అందజేసిన గిఫ్ట్ హ్యాంపర్లలో విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ కాఫీకి చోటు దక్కింది . విదేశీ ప్రతినిధులకు అందజేసిన బహుమతులలో భారతదేశ సంప్రదాయం, కళలను ప్రతిభింబించే విధంగా చేతితో తయారు చేసిన కళాఖండాలు, ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో చేతితో తయారు చేసిన సందూక్, రెడ్ గోల్డ్, షాంపైన్ ఆఫ్ టీ, మడ అడవుల నుంచి సేకరించిన తేనె, కాశ్మీర్ లోయ నుండి కుంకుమపువ్వు, పష్మినా శాలువా, జిఘ్రానా ఇత్తర్, ఖాదీ కండువా, స్మారక స్టాంపులు, ఇతర నాణేలు ఉన్నాయి. జీ-20 సదస్సులో పాల్గొన్న విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన బహుమతులను ప్రశంసించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. ‘‘అరకు ఒరిజినల్స్ బోర్డ్ చైర్మన్ గా ఈ బహుమతి ఎంపికపై నేను వాదించలేను. కాకపోతే ఇది నన్ను ఎంతో గర్వపడేలా చేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారత్ లో పెరిగిన రకానికి ఇది కచ్చితమైన ఉదాహరణ’’ ఇదీ ఆనంద్ మహేంద్ర తాజా ట్వీట్. అంతకుముందు G 20 దేశాధినేతలకు ఆతిథ్య దేశంగా భారత ప్రధాని ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ లో అరకు కాఫీ కు స్థానం – ముచ్చటపడి ధన్యవాదాలు తెలిపిన G- 20 దేశాలు ఈ రెండు ఘటనల నేపథ్యంలో అరకు కాఫీ గురించి మరోసారి అంతర్జాతీయంగా సెర్చ్ చేయడం పెరిగింది. ఈ క్రమంలోనే అరకు కాఫీ ఎక్కడ సాగవుతుంది.. ఎలా తయారు చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..
విశాఖ మన్యం లోని ఎత్తైన కొండ ప్రాంతాల మధ్య ఉండే వ్యాలీ లలో అద్భుతమైన కాఫీ సాగవుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అద్భుతమైన అటవీ ప్రాంతం ఉంది. దీనిని విశాఖ మన్యం, విశాఖ ఏజెన్సీ ప్రాంతం అని అంటారు. ఆ మన్యం, ఏజెన్సీ లో పాడేరు, అరకు లాంటి ఎత్తైన కొండల మధ్య ఉన్న వ్యాలీ లు ఉన్నాయి. ఇక్కడ అత్యంత అరుదైన కొండ జాతి కి చెందిన గిరిజన సంప్రదాయ కుటుంబాలు ఉంటాయి. ఈ వ్యాలీ లలో పూర్తిసేంద్రీయ పద్ధతుల్లో ఆ గిరిజన సోదరుల చేత అరకులోయ, పాడేరు, ఆ పరిసర ప్రాంతాలలో కాఫీ తోటకు అనుకూలంగా ఉండడం, అక్కడ పండే కాఫీ పంట నుంచి తీసే కాఫీ అద్భుతమైన రంగు, రుచి వాసన ఉండడం తో ఒకసారి ఈ కాఫీ తాగిన వాళ్ళు మళ్లీ ఆ కాఫీ కోసమే అరకు, ఈ ప్రాంతాలకు వస్తుండడం తో ఇక్కడ పండుతున్న కాఫీ కు ‘’అరకుకాఫీ’’ అనే ప్రపంచ స్థాయి పేరొచ్చింది.
కాఫీ పంటకు అవసరమైన చల్లటి వాతావరణం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల విశాఖ ఏజెన్సీ ఎప్పుడూ చల్లగా వుంటుంది. దీంతో ఇతర పంటల కంటే ఎక్కువగా కాఫీ తోటల సాగుకి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాఫీ తోటలు ఎదిగి పంట దశకు చేరుకునే ముందు కాఫీ గింజలు పచ్చగా ఉంటాయి. కానీ ఎవరూ వాటిని చూసి గుర్తు పట్టలేరు. పంట పండిన తర్వాత వాటి రూపం మారి మనం చూసే రంగులో ఉంటాయి
1960 నుంచి కాఫీ పంట ప్రారంభం
విశాఖ మన్యం లో సాధారణంగా పోడు వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు రాకపోవడం తో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ 1960లో విశాఖపట్నం జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతంలో కాఫీ పంటకు అనుమతి ఇవ్వటమే కాకుండా ప్రోత్సహించింది. మొదట్లో సుమారు 10,100 ఎకరాలలో దీన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించారు. మొదట ఎవరూ ముందుకు రాకపోవడం తో ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధనే చేపట్టింది. 1956 లో గిరిజన సహకార సంస్ధ ( జీ సీ సీ) ఏర్పాటైంది. దీంతో కాఫీ బోర్డు జీ సీ సీ తో టై అప్ అయింది. అలా జీ సీ సీ సంస్ధని కాఫీ తోటల అభివృద్ధి కోసం వుపయోగించుకోవాలని అప్పట్లో నిర్ణయించారు.
దాంతో గిరిజనుల ద్వారా కాఫీ తోటల పెంపంకంలో జిసిసి కృషి చేయడం ప్రారంభించింది. 1975 నుంచి 1985 వరకు జిసిసిలో కాఫీ తోటల అభివృది విభాగం పేరుతో ఒక ప్రత్యేక విభాగమే ఉండేది. ఇది మొదట సుమారు 4000 హెక్టర్ల కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. క్రమేపీ అరకులో తయారయ్యే అర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలా పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరించడం విశేషం.
1985 తర్వాత అరకు కాఫీ కోసం ప్రత్యేక సంస్థ
ఆర్గానిక్ అరకు కాఫీ కు ప్రపంచవ్యాప్త ఆదరణ పెరగడంతో జిసిసి ఆధ్వర్యంలో అరకుకాఫీ అభివృద్ధి కోసం గిరిజన సహకార కాఫీ అభివృద్ధి సంస్ధ – గిరిజన కోఆపరేటివ్ ప్లాంటేషన్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటైంది. ఈ రకంగా జిసిసి ద్వారా, జిసిపిడిసి ద్వారా అభివృద్ధి చేసిన కాఫీ తోటల్ని గిరిజన రైతులకు ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పంచి పెట్టారు, అప్పట్లో ఇదొక విప్లవాత్మకమైన చర్య గా, గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేందుకు గేమ్ చెంజర్ గా భావించారు. అయితే అనుకున్న మేరకు లక్ష్యాలను సాధించడం లో సరైన కార్యాచరణ లేక విఫలం అయింది. దీంతో 1997 జూలైలో జిసిపిడిసి సంస్ధ కార్యకలాపాలను సిబ్బందితో సహా ఐటిడిఎలో విలీనం చేయాల్సి వచ్చింది. అయినా జీ సీ సీ కాఫీ అభివృద్ధి కార్యక్రమాలను పంచవర్ష ప్రణాళికబద్ధంగా రచింది, ఉపాధి హామీ పథకాన్ని జోడించు అభివృద్ధి చేయడం ప్రారంభించారు. దీంతో లక్ష యాభై వేల ఎకరాలకు చేరి ఈరోజు విశ్వ ఖ్యాతిని పొందింది.
2022-23 లో భారీగా పెరిగిన అరకు కాఫీ టర్నోవర్
గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా కాఫీ సేకరణ, విక్రయం జరుగుతూ ఉంటుంది. 2022-23లో అరకు కాఫీ సేకరణ, విక్రయం 106 టన్నుల నుండి 996 టన్నులకు పెరిగింది. వాస్తవానికి ఈ సంవత్సరం దిగుబడి తగ్గినప్పటికీ, సేకరణ ధరను పెంచడం, దలారీలను నియంత్రించడం తో రైతులను ప్రోత్సహించడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు టీవీ9 తో జీ సీ సీ ఎండీ సురేష్ కుమార్ గేదెల.
కాఫీ సేకరణ ద్వారా సాధించిన వ్యాపారం 2021-22లో కేవలం 24 కోట్ల రూపాయలు మాత్రమే కాగా గడచిన ఆర్థిక సంవత్సరం అది 201 కోట్లకు పెరిగింది. అదే సమయంలో దళారుల నియంత్రణతో జీ సీ సీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బును జమ చేస్తోందనీ, దానివల్ల రైతుల ఆదాయం పెరిగిందని అన్నారు జీ సీ సీ వైస్-ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ కుమార్.
జీ సీ సీ కు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అవుట్‌లెట్‌లు, ఫ్రాంఛైజీల ద్వారా కాఫీ ఉత్పత్తి మరియు విక్రయాల కోసం కేవలం 300 టన్నుల కాఫీ గింజలు చాలు. కానీ మిగిలిన 700 టన్నులను ఇ-వేలం ద్వారా విక్రయించబడేలా చర్యలు తీసుకోవడం తో కార్పొరేషన్‌కు 1.5 కోట్ల లాభం వచ్చిందట. దీంతో కాఫీ గింజల ప్రాసెసింగ్ ఇప్పుడు ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ‘ప్రాసెసింగ్ యూనిట్’లో జరుగుతోందనీ భవిష్యత్ లో మరింత ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు జీ సీ సీ ఎండీ సురేష్
అరకు కాఫీకి ప్రపంచస్థాయి ఖ్యాతి
ప్రపంచంలో కాఫీని అధికంగా పండించే దేశాల్లో బ్రెజిల్ ది మొదటి స్థానం కాగా మన భారతదేశానిది ఏడో స్థానం. బ్రెజిల్ 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తి ని సాధిస్తే మన దేశం మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులతో ఏడవ స్థానంలో ఉంది. ఇండియా లో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుంటే , అందులో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆయిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే అధికం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రసిద్ది చెందిన అరబికా రకం కాఫీ పండుతుంది. ప్యారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ ప్రారంభం అయింది.
మొదటిసారిగా దేశం వెలుపల ఏర్పాటైన ‘అరకు కాఫీ’ ఔట్ లెట్ ఇదే. నాంది ఫౌండేషన్‌కు అనుబంధంగా మహీంద్రా గ్రూప్‌నకు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ దీన్ని ప్యారిస్ లో ఏర్పాటు చేసింది. అందుకే ఆనంద్ మహేంద్ర కు దీంతో అటాచ్ మెంట్ ఏర్పడింది.
కాలక్రమంలో అరకు కాఫీ రుచులు జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాలకూ పాకాయి. 2018లో పారిస్ లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూర్స్-2018 పోటీలో అరకు కాఫీ గోల్డ్ మోడల్ పొందింది.. దాంతో మరొక్కసారి ప్రపంచవ్యాప్తం గా అరకు కాఫీ ఘనత మరోసారి వెలుగు చూసింది.
ఇక అత్యంత రుచికరమైన కాఫీ బ్రాండులకి పేరుపొందిన బ్రెజిల్, సుమత్రా, కొలంబోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పతకాన్ని పొందడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది
పలు అవార్డులు..
2003 నుంచి 2023 వరకు అంటే ఇరవై ఏళ్ళలో విశాఖ కాఫీ పది సార్లు రీజినల్ స్థాయి అవార్డులు పొందింది. జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, మినుములూరు, అనంతగిరి, అరకులోయ తోటల్లో సాగయిన కాఫీ గింజలు అత్యంత నాణ్యమైనవనిగా కాఫీ పంట నిపుణులు తేల్చారు. 2007లో ఆదివాసీ గిరిజన రైతుల చే ఉత్పత్తి గావించబడ్డ అరకు కాఫీ భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్ గా మారింది. ప్రపంచంలో కాకపోయినా పలు కౌంటీలోని కొన్ని అత్యుత్తమ కాఫీ తోటలు అరకు లోయలో కనిపిస్తాయి. రుచికరమైన కప్పు కాఫీ కోసం ఎంత దూరమైనా వెళ్లే వారు కేవలం అరకు కాఫీ కోసమే పలు సార్లు అరకు కు వస్తారంటే అతిశయోక్తి కాదు
ఇంకా రైతులను ప్రోత్సహించి, సరైన గిడ్డంగులు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే అరకు కాఫీ ప్రపంచం లో నంబర్ 1 బ్రాండ్ అవుతుండదనడం లో ఎలాంటి సందేహం లేదు, అతిశయోక్తి కాదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..