Andhra Pradesh: ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్.. ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగానే..
Guntur: ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ ను ఉచితంగా చేశారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నుండి ప్రభుత్వం కూడా 2.56 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రోజు ఉదయం ఆరు గంటలకు మొదలైన ఆపరేషన్ ఒంటి గంట వరకూ సాగింది. ఇద్దరూ కూడా కోలకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. మరోకొ వారం రోజుల తర్వాత అన్ని పరీక్షలు చేసి రోగి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతామని వైద్యులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్, డిసెంబర్19; మరో అరుదైన ఘటనకు గుంటూరు జనరల్ ఆసుపత్రి వేదికైంది. ఏపిలోనే అతి పెద్ద రిఫరల్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రసిద్ధి చెందింది. దాదాపు ఆరు జిల్లాల నుండి రోగులు ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. దాదాపు ముప్పైకి పైగా ప్రత్యేక విభాగాలున్న ఆసుపత్రిలో పదిహేను వందల పడకలున్నాయి. ప్రభుత్వం కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అధునాతన పరికరాలను, ఆపరేషన్ ధియేటర్లను ఏర్పాటు చేసింది. ఈక్రమంలోనే గుంటూరు జనరల్ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లను చేపట్టారు. కరోనా రాక పూర్వం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేన్లు చేసేవారు. దాదాపు 22 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. అయితే కరోనా తర్వాత ఈ ఆపరేషన్లను పక్కనపెట్టారు. తిరిగి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయాలన్న డిమాండ్స్ పెరగటంతో ప్రభుత్వ సాయంతో తిరిగి శస్త్ర చికిత్సలను చేయడం ప్రారంభించారు.
మచిలీ పట్నంకు చెందిన సందీప్ అనే 39 రోగికి కిడ్నీ మార్పిడి చేయాలని నిర్ణయించారు. గత 45 రోజులుగా రోగి జిజిహెచ్ లోని నెఫ్రాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నాడు. అతని తల్లి పద్మావతి కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రావటంతో ఆపరేషన్ ను చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ ను ఉచితంగా చేశారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ నుండి ప్రభుత్వం కూడా 2.56 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రోజు ఉదయం ఆరు గంటలకు మొదలైన ఆపరేషన్ ఒంటి గంట వరకూ సాగింది. ఇద్దరూ కూడా కోలకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. మరోకొ వారం రోజుల తర్వాత అన్ని పరీక్షలు చేసి రోగి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతామని వైద్యులు వెల్లడించారు.
ఇదే ఆపరేషన్ ప్రవేటు ఆసుపత్రుల్లో చేయాలంటే దాదాపు పది లక్షల రూపాయల వరకూ ఖర్చవుతుంది. ఈక్రమంలో పేదలకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ అందని ద్రాక్షగా మారిపోయింది. అయితే ప్రభుత్వం జిజిహెచ్ లో ఈ తరహా చికిత్సలకు అనుమతి ఇవ్వడంతోనే పేదలకు అరుదైన చికిత్స అందుబాటులోకి వచ్చినట్లైంది. ప్రభుత్వ వైద్యులు కూడా ఛాలెంజింగ్ తీసుకొని శస్త్రచికిత్స చేశారు. ఇది విజయవంతం అయితే రానున్న రోజుల్లో గుండెకు సంబంధించిన అరుదైన ఆపరేషన్లు చేసేందుకు రంగం సిద్దంచేస్తున్నారు. మొత్తం మీద చాలా ఖరీదైన శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తుండటంతో పేదల రోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..