Kidney disease: ఊర్లకు ఊర్లనే మింగేస్తున్న మహమ్మారి.. ఏ ఇంటిని కదిలించిన రక్తకన్నీరే.. 13 మండలాలను వణికిస్తున్న భూతం..!
కరోనాతోపాటు కిడ్నీ మహమ్మారి కృష్ణా జిల్లాలోని ప్రజలను మింగేస్తోంది. సైలెంట్‌గా 13 మండలాలను వణికిస్తోందీ రాకాసి రోగం.
Kidney disease in Krishna district: కరోనాతోపాటు కిడ్నీ మహమ్మారి కృష్ణా జిల్లాలోని ప్రజలను మింగేస్తోంది. సైలెంట్‌గా 13 మండలాలను వణికిస్తోందీ రాకాసి రోగం. రెండు కిడ్నీలు పాడై మృత్యువుతో పోరాడుతున్న వాళ్లు కొందరైతే… ఒక కిడ్నీతో బతుకు ఈడుస్తున్న వారి మరికొందరు. ఏ ఇంటి వారిని కదిలించినా రక్తకన్నీరే ఉబికి వస్తోంది. కృష్ణాజిల్లాలోని 13 మండలాలను కిడ్నీ మహమ్మారి వణికిస్తోంది. తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోదీ పాడు జబ్బు.
ఏ తాండాలోకి వెళ్లినా ఇవే కథలు. కన్నీటి గాథలు. ఏ ఇంటిని పలకరించినా ఇదే వ్యధ. ఏ గడప తొక్కినా చావుకబురే.. కడుపు తరుక్కుపోయే విషాదాలు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. 300 గ్రామాల్లో ఇవే దృశ్యాలు. గుండెలను పిండేసే ఆర్తనాథాలు. కొందరికి 2 కిడ్నీలు పాడయ్యాయి. మరికొందరు ఒక కిడ్నీతోనే బతుకుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు చచ్చిపోయారు. కొన్ని ఇళ్లల్లో అమ్మా, నాన్న చనిపోయి పిల్లలు అనాథలయ్యారు. మరికొన్ని ఇళ్లల్లో చేతికి అందివచ్చిన కొడుకులు అర్థాంతరంగా తనువు చాలించారు. తల్లిదండ్రుల బతుకు భారంగా మిగిల్చారు.
కిడ్నీ డిసీజ్ ఓవైపు కమ్మేస్తుంటే… వారిపై కొవిడ్ మరింతగా విరుచుకుపడుతోంది. ఆక్సిజన్ అందక అవయాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సరైన టైంలో డయాలసిస్ చేయకపోతే రోగి ప్రాణాలమీదకు వస్తుందని డాక్టర్ అమ్మన్న అంటున్నారు.విజయవాడ ప్రభుత్యాసుపత్రిలో బెడ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కిడ్నీ రోగులు. కేవలం 9 బెడ్స్‌పై డియాలసిస్ చేస్తున్నారు. తీవ్రమైన కిడ్నీ సమస్యతో ఉన్నవారిని మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నారు. మిగిలిన వారు విలవిల్లాడిపోతున్నారు. అయితే, కొందరికి ప్రభుత్వ సాయం కొందరికే అందుతోంది. చదువురాని వారికి ఈ సాయం సంగతే తెలియడం లేదు.
ఇంతకీ ఈ కిడ్నీ రోగాలకు కారణమేంటి? పచ్చని గ్రామాలను మహమ్మారి ఎందుకు కాటేస్తోంది అంటే కారణం నీళ్లు. దాహం తీర్చే వాటరే దహించేస్తోంది. నీళ్లలోని ఫ్లోరైడ్ ప్రాణం తీస్తోంది. ముందుగా ఒళ్లు, కీళ్లు , నడుం నొప్పితో మొదలవుతోంది. చిన్న సమస్యలే అనుకుంటారు. లోకల్ వైద్య సిబ్బందితో మాట్లాడి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్లు తీసుకుంటారు. అవన్నీ కిడ్నీలపై ప్రభావం చూపుతున్నాయి. కొద్ది రోజుల్లోనే కిడ్నీలు పాడవుతున్నాయి. చివరి నిమిషంలో పెద్ద డాక్టర్లకు చూపిస్తున్నారు. తమకు కిడ్నీ రోగం ఉందని తెలిసే సరికే ప్రాణం మీదికొస్తోంది. కూలి పనులకు వెళ్లలేక చాలా మంది ఇంట్లోనే కూలబడుతున్నారు.