YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన అప్‌డేట్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు స్వాధీనం
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. హత్యకు..
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు పురోగతి సాధించారు. హత్యకు వినియోగించిన ఆయుధాల కోసం ఇటీవల తనిఖీలు చేపట్టిన సీబీఐ అధికారులు.. ఎట్టకేలకు వాటిని కనుగొన్నారు. అనుమానితుల ఇళ్లలోనే అధికారులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న సునీల్ యాదవ్‌ను ఇచ్చిన కీలక సమాచారంతో అధికారులు మారణాయుధాల ఆచూకి పట్టగలిగారు.
బుధవారం జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు. సునీల్ యాదవ్ సీబీఐ విచారణలో .. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తుకు లేదని చెప్పడంతో తమదైన స్టైల్లో విచారణ చేశారు. దీంతో కావాల్సిన సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు ఈ రోజు నాలుగు చోట్ల ..అనుమానితుల నివాసాల్లో సోదాలు చేయగా..అక్కడ హత్యకు వినియోగించిన ఆయుధాలు దొరికినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు వాగుల్లో ఆయుధాలు వేశామని చెప్పి తొలుత తమను సునీల్ తప్పు దోవ పట్టించాడని అధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా ఆయుధాలతో పాటు సునీల్ యాదవ్ బ్యాంక్ పాస్ బుక్ స్వాధీనం చేసుకున్న సీబీఐ.. కొన్నేళ్ల క్రితం అతడి అకౌంట్‌లో జరిగిన లావాదేవీల గురించి ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించిన రశీదులను పరిశీలిస్తోంది.
2019 మార్చి 15న వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసంలోనే కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి మాజీ మంత్రిని దుండగులు హతమార్చారు. ఆ తరువాత విచారణ సమయంలోనూ…రాజకీయంగానూ అనేక సమీకరణాలు మారుతూ వచ్చాయి. దీని పైన విచారణ చేస్తున్న సీబీఐ కొంతకాలంగా దూకుడు పెంచింది. అనుమానితులను అందర్నీ పిలిచి విచారించింది. హత్య కేసులో కీలకంగా భావిస్తున్న వ్యక్తుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేసింది. కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే.. త్వరలోనే వివేకా హత్యకేసు మిష్టరీని చేధించి నిందితులను అరెస్ట్ చేస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read:ఆ మహిళలకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లలో నగదు జమ