Pawan Kalyan: పేపర్ ప్లేట్లో అంబేద్కర్ ఫోటోపై జనసేనాని స్పందన .. తప్పుని ప్రశ్నించిన యువకులపై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదన్న పవన్
తప్పుని తప్పని ప్రశ్నించిన గోపాలపురం ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం భావ్యం కాదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: కోనసీమ జిల్లా (Konaseema District) రావులపాలెం మండలం(Ravulapalem Mandal) గోపాలపురంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అంబేద్కర్ ఫోటోలు ఉన్న పేపర్ ప్లేట్లలో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్ పై అంబేద్కర్ ఫోటో ముద్రించిన విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అసలు అంబేడ్కర్ ఫోటోలను టిఫిన్ కాగితం ప్లేట్లపై ముద్రించడం తప్పని అన్నారు. తప్పుని తప్పని ప్రశ్నించిన గోపాలపురం ఎస్సీ యువకులపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసులు నమోదు చేయడం భావ్యం కాదన్నారు. 18 మంది ఎస్సీ యువకులపై నేరపూరిత కుట్ర ఆపాదిస్తూ కేసు నమోదు చేయడం ద్వారా అధికారులు ఈ విషయాన్ని తీవ్రతరం చేశారని చెప్పారు. ఇటువంటి సున్నితమైన విషయాల్లో పోలీసు అధికారులు సామరస్య ధోరణితో వ్యవహరించాలని సూచించారు.
ప్రజల మధ్య దూరం పెరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులతోపాటు అన్ని పార్టీలపైనా ఉందన్నారు జనసేనాని. ఇలాంటి ఘటనలు చోటు చేసుకొన్నప్పుడు స్థానికంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాలూ ఒక తాటిపైకి వచ్చి శాంతి కమిటీ వేసుకోవాలని.. సుహృద్భావ పరిస్థితులు నెలకొనేలా చర్చించుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు.
డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్ పై అంబేద్కర్ ఫోటో ముద్రించి అదే ప్లేట్స్ లో ఫాస్ట్ ఫుడ్ సరఫరా చేయడం గమనించిన పలువురు హోటల్ వద్ద ఘర్షణకు దిగారు. ఈ విషయం పోలీసుల దృష్టికి చేరుకోవడంతో హోటల్ యజమాని సహా ప్లేట్లు సరఫరా చేసిన వ్యాపారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు అవమానం జరిగిందంటూ.. హోటల్ పై దాడి చేసి వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టేలా ప్రచారాలు చేసిన 18మంది యువకులపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.