జల్లికట్టు పోటీలకు రంగం సిద్ధం.. ఎద్దులకు స్పెషల్ డైట్ తో జాగ్రత్తలు తీసుకుంటున్న నిర్వాహకులు..
చంద్రగిరి మండలంలోనే దాదాపు 16 గ్రామాల్లో జల్లికట్టు పోటీలు పెద్ద ఎత్తున జరుగుతుండగా ఆ పోటీల్లో తమ ఎద్దులను అందంగా అలంకరించి నిలువరించే వాడెవరన్న ధీమాతో జల్లికట్టు కు సిద్ధమవుతున్నారు. చంద్రగిరి మండలం సి.మల్లవరం కు చెందిన వాసు రెడ్డి అనే యువకుడు ఆంధ్ర చిరుత పేరుతో ఎద్దును జల్లికట్టుకు సిద్ధం చేశాడు. జల్లికట్టు కు 3 నెలలు ముందు నుంచే ఎద్దులకు ప్రత్యేక డైట్, దాణాతో పాటు వైద్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
చిత్తూరు జిల్లా, జనవరి 06; జల్లికట్టు.. ఏపీలో నిషేదం. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ప్రభుత్వ అనుమతితో నిర్వహించే సంబరం. సంక్రాంతిలో సాంప్రదాయ క్రీడగా జల్లికట్టు నిర్వహణపై గత కొన్నేళ్లుగా పోలీసులు ఆంక్షలున్నా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం అనుమతి అక్కర్లేని పశువుల పరుగు పందెం. జల్లికట్టు తరహాలో యధావిధిగానే కొనసాగే సాహస యుద్ధం. పశువులతో పోటీ పడేందుకు యువత చూపుతున్న ఉత్సాహం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో షురూ అయ్యింది. జల్లికట్టు కు గ్రామాలు సిద్దం అవుతుండగా జల్లికట్టు పోటీలో పాల్గొనేందుకు ఎద్దులు కాలు దువ్వి లంకె లేస్తున్నాయి. ఎద్దులను సిద్దం చేస్తున్న యజమానులు వాటి పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.
సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో జల్లికట్టు సందండి నెలకొంటుంది. పండగనెల వచ్చిందంటే చాలు గిత్తలు రంకేస్తాయి. నెలంతా ఏదో ఒక చోట పశువులను పరుగులు పెట్టించే సాహసక్రీడ కొనసాగుతూనే ఉంటుంది. గ్రామీణ యువతను ఉర్రూతలూగించే ఆటపై పోలీసుల ఆంక్షలు నిషేదమన్న వార్నింగ్ లున్నా పశువుల పరుగులు మాత్రం ఆగడం లేదు. దీంతో జల్లికట్టు అంటేనే గుర్తుకు వచ్చే చంద్రగిరిలో ఇప్పటికే జల్లికట్టు కొత్త ఏడాది తొలిరోజే ప్రారంభం అయ్యింది.
గ్రామీణ సంస్కృతిలో సాహసక్రీడగా కొనసాగుతున్న జల్లికట్టు కు రంగంపేట పెట్టింది పేరు.. కాగా నెల రోజుల పాటు ఏదో ఒక గ్రామంలో జల్లికట్టు జరుగుతూనే ఉంటుంది. అనుమతి లేని జల్లికట్టు పట్ల సీరియస్ గా వ్యవహరించని పోలీసు యంత్రాంగం తీరు ఒక వైపైతే, మరోవైపు జల్లికట్టుకు ఎద్దులను సిద్ధం చేస్తున్న యజమానులు గత మూడు నెలలుగా వాటి పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆహార నియమాలతో పాటు వాటి ఆరోగ్య పరిస్థితులపట్ల అత్యంత జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎద్దులను వ్యవసాయానికి కాకుండా కేవలం జల్లికట్టు పోటీల్లో నిలబెట్టి పేరు ప్రఖ్యాతులను చాటే ప్రయత్నం చేస్తున్న కొందరు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కాలుదువ్వి రంకె లేసేలా ఎద్దులకు శిక్షణ ఇస్తున్న యజమానులు జల్లికట్టులో పట్టుకునే మగాడేలేడని ప్రైజ్ మనీ లు పెడుతున్నారు. రాజకీయ పార్టీల జెండాలు, నాయకులు, అభిమాన హీరోల ఫోటోలతో పలకలు పట్టి పశువులను పరిగెత్తిస్తున్నారు యజమానులు.
చంద్రగిరి మండలంలోనే దాదాపు 16 గ్రామాల్లో జల్లికట్టు పోటీలు పెద్ద ఎత్తున జరుగుతుండగా ఆ పోటీల్లో తమ ఎద్దులను అందంగా అలంకరించి నిలువరించే వాడెవరన్న ధీమాతో జల్లికట్టు కు సిద్ధమవుతున్నారు. చంద్రగిరి మండలం సి.మల్లవరం కు చెందిన వాసు రెడ్డి అనే యువకుడు ఆంధ్ర చిరుత పేరుతో ఎద్దును జల్లికట్టుకు సిద్ధం చేశాడు. జల్లికట్టు కు 3 నెలలు ముందు నుంచే ఎద్దులకు ప్రత్యేక డైట్, దాణాతో పాటు వైద్య పరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
జల్లికట్టులో పాల్గొనే ఎద్దును కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. కోస్తాలో కోడి పందేలకు సిద్ధమయ్యే కోళ్ల పెంపకంకు ధీటుగానే ఎద్దుల ఆలనా పాలనా పట్ల అంతే శ్రద్ద చూపుతున్నారు జల్లికట్టు నిర్వాహకులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..