AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Elections 2024: ఆ జిల్లాలో టీడీపీకి కత్తిమీద సాములా మారిన పొత్తు వ్యవహారం..

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలైంది. నోటిఫికేషన్ కు ముందే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అధికార వైసీపీ ఆచీచూచి అడుగులు వేస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో సీట్ల పంచాయతీ టిడిపి హై కమాండ్‎కు సవాలుగా మారింది.

AP Elections 2024: ఆ జిల్లాలో టీడీపీకి కత్తిమీద సాములా మారిన పొత్తు వ్యవహారం..
Pawan Chandrababu
Raju M P R
| Edited By: Srikar T|

Updated on: Mar 01, 2024 | 4:16 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలైంది. నోటిఫికేషన్ కు ముందే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అధికార వైసీపీ ఆచీచూచి అడుగులు వేస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో సీట్ల పంచాయతీ టిడిపి హై కమాండ్‎కు సవాలుగా మారింది. అధినేత సొంత జిల్లా చిత్తూరులో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటికే ప్రకటించిన స్థానాలతో పాటు భవిష్యత్తులో ప్రకటించబోయే నియోజకవర్గాల్లోనూ గందరగోళం నెలకొంది. ఇంకా 7 అసెంబ్లీ సెగ్మెంట్‎లతోపాటు 2 పార్లమెంట్ సీట్లను ప్రకటించాల్సిన టిడిపి హై కమాండ్ పొత్తుల అంశంతో కుస్తీలు పడుతోంది. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేయబోయే కుప్పంతో పాటు పలమనేరు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, నగరి, తంబళ్లపల్లి, పీలేరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. చంద్రబాబు మిగతా చోట్ల ఎవరిని బరిలో దింపాలన్న దానిపై మేధోమధనం చేస్తున్నారు. తిరుపతితోపాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, పూతలపట్టు, మదనపల్లి, పుంగనూరు అసెంబ్లీ స్థానాలే కాకుండా.. తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాలకు బరిలో దింపే అభ్యర్థులు ఎవరన్న దానిపై క్లారిటీ ఇవ్వలేక పోతున్నారు. దీంతో పార్టీ ఇన్‎చార్జ్‎లు, ఆశావాహుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ప్రకటించిన నగిరిలో టిడిపి ఇన్‎చార్జ్‎ గాలి భాను ప్రకాష్‎కు వ్యతిరేకంగా పార్టీ నేతలు కొందరు అసమతి రాగం వినిపిస్తున్నారు.

ఇక చిత్తూరులోనూ ఇదే పరిస్తితి ఉంది. చిత్తూరు టిడిపి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్‎ను ప్రకటించిన హై కమాండ్ నిర్ణయం బలిజ సామాజికవర్గాల్లో అసంతృప్తికి కారణమైంది.ఈ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు ఆ పార్టీ చెక్ పెడితే, బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే చిత్తూరులో టిడిపి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ సామాజిక వర్గం రోడ్డు ఎక్కింది. ఇక శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‎కే టికెట్ అన్న ప్రచారం ఎన్నో రోజులుగా ఉంది. శ్రీకాళహస్తి టిడిపి ఇన్‎చార్జ్‎గా బొజ్జల సుధీర్ ఇప్పటికే జనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టగా.. తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో అయోమయం నెలకొంది. దీంతో ఆశావాహులు కొందరు తమకే ఛాన్స్ అన్న ప్రచారాన్ని తెర మీదికి తెస్తున్నారు. ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు. శ్రీకాళహస్తి టికెట్‎పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు ఉండవల్లిలో ప్రయత్నిస్తుంటే, మరోవైపు పొత్తులో భాగంగా జనసేన, బిజెపిలు హడావిడి చేస్తున్నాయి.

ఒక అడుగు ముందుకేసిన జనసేన ఇన్‎చార్జ్ వినూత పార్టీ అభ్యర్థిగా శ్రీకాళహస్తి నుంచి బరిలో ఉంటానని ఏకంగా ప్రచారం చేపట్టింది. మరోవైపు బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ బిజెపి టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. శ్రీకాళహస్తిలోనే కాదు సత్యవేడులోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ హై కమాండ్ టచ్‎లోకి వెళ్లడంతో ఇప్పటికే పార్టీ ఇన్‎చార్జ్‎గా ఉన్న హెలెన్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వైసీపీని వీడిన ఎమ్మెల్యే ఆదిమూలంకు అవకాశం ఇవ్వాలా లేక టిక్కెట్‎ను ఆశిస్తున్న జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలారి ఆదిత్య లేదంటే మరొకరిని బరిలో దింపాలా అన్న దానిపై నిర్ణయం తీసుకోలేని డైలామాలో పడింది టిడిపి అధిష్టానం. ఇక తిరుపతి విషయం టిడిపికి పెద్ద టాస్క్‎గా మారింది. పొత్తులలో భాగంగా ఏ పార్టీ జెండా తిరుపతిలో ఉండాలో తేల్చకపోతోంది. తిరుపతి టికెట్ టిడిపికా లేక జతకట్టిన జనసేనకా లేదంటే పొత్తుకు సిద్ధమైన కమలం పార్టీకా అన్నది ఆ పార్టీకి కన్ఫ్యూజన్ గా మారింది.

ఇవి కూడా చదవండి

టిడిపిలో ఆశావాహులు అర డజనుకు పైగా ఉంటే మరోవైపు జనసేన బిజెపిలోనూ తిరుపతి టికెట్‎ను ఆశించే వారి జాబితా చాంతాడంత ఉంది. ఇక చంద్రగిరి బరిలో ఎవరన్నది కూడా ప్రశ్నగా మారింది. ఇప్పటికే టిడిపి చంద్రగిరి ఇన్‎చార్జ్‎గా ఉన్న పులివర్తి నాని విషయంలో టిడిపి హైకమాండ్ క్లారిటీ ఇచ్చినా గతంలో చంద్రబాబు ప్రకటించిన జాబితాలో చంద్రగిరి పేరు లేకపోవడం చర్చగా మారింది. ఇప్పటికే లోకేష్ యువగళంలోనూ పులివర్తి నానికి లైన్ క్లియర్ చేసినా చంద్రగిరిలో మార్పు అనివార్యం అంటున్న ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఇక పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికే చంద్రబాబు పూతలపట్టు బహిరంగ సభలో పార్టీ ఇన్‎చార్జ్‎గా ఉన్న డాక్టర్ మురళీమోహన్‎కు ఓకే చెప్పినా లిస్టులో పేరు కనిపించకపోవడంతో ఆశావాహులు క్యూ కడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే రవితో పాటు పూతల పట్టుకు చెందిన ఆనగల్లు మునిరత్నం, పారిశ్రామికవేత్త ముత్తు ప్రయత్నిస్తున్నారు.

ఇక మదనపల్లిలో టిడిపి, జనసేన, బిజేపీ పొత్తుల అంశం తలనొప్పిగా మారింది. మదనపల్లి టిడిపి ఇన్‎చార్జ్‎గా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు టిడిపి టికెట్‎ను ఆశిస్తుంటే.. జనసేన మదనపల్లి తమదేనంటోంది. రాయలసీమ జనసేన కో- కన్వీనర్‎గా ఉన్న రాందాస్ చౌదరి ఇప్పటికే మదనపల్లిలో హడావుడి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రామదాస్ చౌదరి సతీమణి ప్రస్తుతం మదనపల్లి జనసేన ఇన్‎చార్జ్‎గా ఉన్నారు. గతంలో గంగారపు స్వాతికి 16 వేలకుపైగా ఓట్లు రావడం, బలిజ సామాజిక వర్గం ప్రభావితం చూపే మదనపల్లిలో సీటు తమకేనంటూ జనసేన సందడి చేస్తోంది. మరో వైపు బిజెపి కూడా మదనపల్లిని కోరుతోంది. 2014 ఎన్నికల్లో టిడిపి బిజెపి జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ బరిలో దిగిన బిజెపి ఇప్పుడు అదే పొత్తుతో తిరిగి మదనపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. దీంతో టిడిపి అధిష్టానం మదనపల్లి విషయంలో ఎటు తేల్చుకోలేకపోతోంది.

ఇక పుంగనూరులో టిడిపి ఇన్‎చార్జ్‎గా ఉన్న చల్లా బాబుకు పోటీ లేకపోయినా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధీటైన పోటీ ఇవ్వాలన్న టార్గెట్‎తో టిడిపి మల్లగుల్లాలు పడుతోంది. అలాగే కుప్పం, తంబళ్లపల్లి, పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపి అభ్యర్థులకు ఎలాంటి నిరసన సెగలు అభ్యంతరాలు లేకపోగా ఇప్పటికే టిడిపి అభ్యర్థిని ప్రకటించిన తంబళ్లపల్లిలో అసమతి సెగలు రాజు కుంటున్నాయి. తంబళ్లపల్లి టిడిపి ఇన్‎చార్జ్‎గా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‎ను పక్కన పెట్టి జయచంద్ర రెడ్డి‎కి ఛాన్స్ ఇవ్వడంతో శంకర్ అనుచరుల అసంతృప్తి రోడ్డెక్కేలా చేసింది. మాజీ ఎమ్మెల్యే శంకర్‎కే అవకాశం ఇవ్వాలంటూ తెలుగు తమ్ముళ్లు ఉండవల్లికి కూడా చేరుకున్నారు. ఇలా టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో ఇంకా ప్రకటించాల్సిన ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిస్థితి. ఇలా ఉంటే రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్థి విషయంలోనూ టిడిపిలో ఎలాంటి క్లారిటీ లేదు. తిరుపతి, చిత్తూరు పార్లమెంటు స్థానాలను ఎవరికి కేటాయించాలి, పొత్తులో భాగంగా ఏ పార్టీ కోసం త్యాగం చేయాలో అర్ధం కాని కన్ఫ్యూజన్ తెలుగుదేశంలో నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..