Amalapuram: జనసేన నేతల్లో ఆధిపత్య పోరు.. వారాహి యాత్ర ప్రారంభ సమయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా..
Janasena Party: అమలాపురంలో జనసేన పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. అధినేత వారాహి యాత్ర టైమ్‌లో.. కలిసి ముందుకుసాగాల్సిన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో క్యాడర్ కన్ఫూజన్‌లో పడిపోయింది..

Janasena Party: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. జనసైన నాయకుల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. అమలాపురంలో జనసేన గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా గ్రూపు రాజకీయాలు మరోసారి బయట పడ్డాయి. గత నాలుగు రోజులుగా వారాహి యాత్రపై అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి గ్రామగ్రామన ప్రచాం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించి.. పవన్ కళ్యాణ్ మీటింగ్, బహిరంగ సభ ప్రాంతాలను పరిశీలించారు.
అయితే మంగళవారం మరో వర్గానికి చెందిన నేత డీఎంఆర్ శేఖర్.. వారాహి యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారాహి యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పార్టీలో ఉన్న లుకలుకలు బయటపడుతున్నాయి. ఎవరికి వారు పోస్టర్లు ఆవిష్కరించడంపై పార్టీ కార్యకర్తలు విస్మయానికి గురవుతున్నారు. ఒకవైపు అధినేత పవన్ వారాహి యాత్ర సక్సెస్ కావాలని కార్యకర్తలు, అభిమానులు సర్వశక్తులు ఒడ్డుతుంటే నేతలు మాత్రం వర్గ పోరులో బిజీ అయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలిసి నడవాల్సిన సమయంలో ఈ పంచాయితీ ఎంటని అసహానం వ్యక్తం చేస్తున్నారు. కింది స్థాయి క్యాడర్‌ను కలుపుకొని పోవాల్సింది పోయి నాయకులే ఎవరికి వారి ముందుకు వెళ్తున్నారని కింది స్థాయి కార్యకర్తలు అంటున్నారు.
మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. అన్నవరం సత్యదేవుని దర్శనం అనంతరం పవన్ రాజకీయ యాత్ర లాంఛనంగా ప్రారంభం కానుంది. పలు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. వారాహి నుంచి పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ కత్తిపూడి కూడలిలో జరుగనుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో జనసేనాని సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు.. బాధలు తెలుసుకొనేందుకు ‘జనవాణి’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..