Araku Valley: కుర్చీ మడతపెట్టి అంటూ ఐఏఎస్ స్టెప్పులు.. కార్నివాల్‌లో క్రేజీ సందడి
వాళ్లంతా యువ ఐఏఎస్‌లు.. ఎప్పుడు ఫైళ్లు.. పనుల్లో బిజీబిజీగా గడుపుతుంటారు.. అది కూడా ఏజెన్సీ ప్రాంతం అయితే.. గిరిజనుల సమస్యలు విని వారి కష్టాలు తీర్చేందుకు తనకు ఇచ్చిన బాధ్యత పట్ల శ్రమిస్తూ ఉంటారు.. కానీ.. ఇప్పుడు ఆ ఐఏఎస్‌లు ఆడి పాడుతున్నారు.. గిరిజనులతో సాంప్రదాయ నృత్యాలే కాదు.. ఏకంగా సినీ పాటలకు ఇరగదీస్తూ స్టెప్పులు వేస్తున్నారు.. ఆ కుర్చీని మడత పెట్టి అంటూ.. ఓ యువ ఐఏఎస్ స్టెప్పులకు అందరూ ఫిదా అయ్యారు..

అరకు లోయలో సందడే సందడి.. చలి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.. తొలిరోజు ఉదయం 5కే రన్ తో ప్రారంభమై.. ఆ తర్వాత డోలు వాయించి లాంఛనంగా ప్రారంభమయ్యాయి.. ఒకవైపు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే ప్రదర్శనలు.. మరోవైపు అడ్వెంచర్ టూరిజంలో భాగమైన హాట్ ఎయిర్ బెలూన్, పారా గ్లైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక హెలిజాయ్ రైడ్‌కు సందర్శకులు క్యూ కట్టారు.
ఇదిలా ఉంటే.. తొలిరోజు సాయంత్రం గిరిజన కళాకారుల కార్నివాల్ కలర్ ఫుల్‌గా సాగింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో కళాకారులు కార్నివాల్ చేశారు. కారనివాల్‌ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఐటిడిఏ పిఓ అభిషేక్ ప్రారంభించారు. తమిళనాడు, మణిపుర్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 18 గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేశారు. మ్యూజియం నుంచి ప్రధాన వేదిక వరకు ప్రదర్శనలు నిర్వహించారు. కొయ్యబూర నృత్యం, కొమ్ము డాన్సులు ఆకట్టుకున్నాయి.
డ్యాన్సులతో సందడే సందడి..
కార్నివాల్ సందర్భంగా యువ ఐఏఎస్‌లు సందడి చేశారు. కళాకారులతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్, ఐటిడిఏ పిఓ అభిషేక్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొన్నారు. పి ఓ అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్ డోలు వాయించి ఉత్సాహం పెంచారు. ఇక ఐటీడీఏ పీవో అభిషేక్ అయితే.. మరో అడుగు ముందుకేసారు. సినీ పాటలకు లయబద్ధంగా స్టెప్పులు వేస్తారు. కుర్చీ మడతపెట్టి సాంగ్.. వినిపించగానే ఫుల్ జోష్‌తో డాన్స్ చేశారు. ‘రాను రాను అంటుంది చిన్నదో..’ కూడా తమదైన స్టైల్ లో డాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. ఎప్పుడూ ప్రొటోకాల్ మధ్య ఈ ఆఫీసర్లను చూసిన గిరిజనులు.. ఇప్పుడు తమలో ఒకరిగా కలిసి సందడి చేయడంతో వారిని నృత్యాలకు సందడికి గిరిజనులు ఫిదా అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి