AP – Telangana: అల్పపీడనం ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన
వాన జోరు...హైదరాబాద్ బేజారు. లేటెస్టుగా మరోసారి భారీ వర్షంతో నగరం తడిసి ముద్దయింది. రాబోయే రెండుమూడు రోజుల్లో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇక ఏపీలో కూడా వానలు దంచి కొడుతున్నాయి. తెలుగు స్టేట్స్‌లో లేటెస్ట్ రెయిన్ అప్ డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం...

హైదరాబాద్‌ని మరోసారి భారీ వర్షం పలకరించింది. కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, జగద్గిరిగుట్ట, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, దుండిగల్, సనత్‌నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బోయిన్‌పల్లి, అల్వాల్, ప్యాట్నీ, చిలకలగూడ, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. పలుచోట్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కోకాపేట్, మణికొండలో భారీ వర్షం కురిసింది. దీంతో మాన్సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి.
హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాతబస్తీలో పురాతన భవనం కుప్పకూలింది. పాతబస్తీ హుస్సేని ఆలంలో 114 ఏళ్ల ఈ పురాతన భవనం కూలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం బోయపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో వర్షపునీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం!
ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో, తెలంగాణకు నాలుగు రోజుల పాటు వర్ష సూచన చేసింది IMD. మంగళవారం నాడు తెలంగాణలో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బుధవారం నాడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని తెలిపింది.
ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇక ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేసింది IMD. పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40-50కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
కర్నూలు జిల్లా అస్పరి మండలంలో భారీ వర్షంతో తుమ్మలవాగు పొంగుతోంది. వలగొండ గ్రామంలోకి వరద నీరు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో భారీ వర్షాలతో మారుతి నగర్, హాజీ నగర్ జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీటితో జనం నానా అవస్థలు పడుతున్నారు. వీపనగన్న గ్రామంలోకి వర్షపు నీరు భారీగా చేరింది. అత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది. వెలుగోడు దగ్గర మంచినీళ్లవాగు పొంగి పొర్లుతోంది. దీంతో వెలుగోడు, రేగడగూడురు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. బనగానపల్లె కోవెలకుంట్ల, అవుకు, సంజామల ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
నంద్యాల జిల్లా మిడుతూరు మండలం జలకనూరు గ్రామంలో చెరువుకు గండి పడడంతో..పంట పొలాలు నీట మునిగాయి. చెరువుకట్ట తెగి వరద ఊరి మీద పడుతుందేమో అనే భయంతో గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో..భారీ వర్షాల ధాటికి కోడుమూరు టౌన్‌లో తెల్లవారుజామున ఓ ఇల్లు కూలిపోయింది. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
