Home Guard Cheating: ఒంగోలు ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తోన్న హోంగార్డు వాణి లీలలు..!
హోంగార్డుగా పనిచేస్తున్నా.. మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అంటూ డబ్బులు వసూలు చేసిన హోంగార్డు వాణితో పాటు, మరో ఇద్దరు మహిళలను ఒంగోలు ఒన్‌టౌన్
Ongole Home Guard Cheating: హోంగార్డుగా పనిచేస్తున్నా.. మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అంటూ డబ్బులు వసూలు చేసిన హోంగార్డు వాణితో పాటు, మరో ఇద్దరు మహిళలను ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నగరంలోని పలువురి దగ్గర వాణి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేగాక ఏకంగా ఎపి డిజిపి, ప్రకాశం ఎస్‌పి పేరుతో ఉన్న నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు సైతం జారీ చేసిన విషయం బయటపడింది. వీటిపై ఫోర్జరీ డిజిపి సంతకాలు, ఎస్‌పి సంతకాలు, నకిలీ స్టాంపులను సహచర నిందితులతో కలిసి హోంగార్డు వాణి సృష్టించింది. ఆమె దగ్గర ఉన్న నకిలీ స్టాంపులు, డిజిపి పేరుతో ఉన్న లెటర్ హెడ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
కేసు వివరాల్లోకి వెళ్తే, నిందితురాలు చెట్ల వాణి హొంగార్డుగా పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తుంది. ఒంగోలులోని జిల్లా ఎస్‌పి కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో హొంగార్డుగా పనిచేసింది. హోంగార్డు ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని ఈజీగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో పెద్ద పధకమే వేసింది. పోలీసు శాఖలో తనకు ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయంటూ పలువురిని నమ్మించింది. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొంతమందికి మోసపూరిత మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసింది. నగరంలోని పలువురి దగ్గర దాదాపు రూ. 5 లక్షలు వరకు వసూలు చేసింది.
డబ్బులు తీసుకున్న తరువాత అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసి వారికి అందించింది వాణి. అపాయింట్‌మెంట్ ఆర్డర్ తయారు చేసేందుకు డిటిపి, స్టాంపుల తయారుచేసే మరో నలుగురిని తన బృందంలో చేర్చుకుంది. వీరి ద్వారా ఎపి డిజిపి, జిల్లా ఎస్‌పిల పేరుతో లెటర్ హెడ్‌లు, నకిలీ స్టాంపులతో ఆపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసింది. తమకు నకిలీ ఆపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్టు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో హోంగార్డు బండారం బయటపడింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మహిళా హోంగార్డు వాణితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో బాధితుల పిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు ఎస్‌పి మలిక గార్గ్ తెలిపారు.