AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఇంటి టైల్స్ చీల్చుకుని వెలసిన అమ్మవారు.. ఏపీలో ఆశ్చర్యకర ఘటన

హిందూపూర్ సమీపంలోని సంజీవరాయనపల్లిలో ఒక ఇంట్లో అమ్మవారు పుట్ట రూపంలో వెలిసి, భక్తుల కోరికలు తీరుస్తున్నారు. టైల్స్ చీల్చుకొని పెరిగిన ఈ పుట్ట సుమారు 20 సంవత్సరాలుగా పెరుగుతూ ఉంది. ఆరోగ్య సమస్యలు, సంతానలేమి సహా అనేక కష్టాలకు ఇక్కడ పరిష్కారం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి శుక్రవారం, మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి.

Andhra: ఇంటి టైల్స్ చీల్చుకుని వెలసిన అమ్మవారు.. ఏపీలో ఆశ్చర్యకర ఘటన
Divine Anthill GoddessImage Credit source: Connect with Balu
Ram Naramaneni
|

Updated on: Nov 30, 2025 | 4:17 PM

Share

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో హిందూపూర్ పట్టణానికి సుమారు ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంజీవరాయనపల్లి గ్రామం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంఘటనకు వేదికగా మారింది. ఈ గ్రామంలోని ఒక నివాస గృహంలో సాక్షాత్తు మారెమ్మ అమ్మవారు పుట్ట రూపంలో వెలిశారని, అనేక మంది భక్తులకు అద్భుతాలు చూపుతున్నారని స్థానికులు, సందర్శకులు విశ్వసిస్తారు. ఈ పుట్ట, సాధారణ నేలపై కాకుండా, ఇంట్లో వేసిన టైల్స్, సిమెంట్ ఫ్లోరింగ్‌ను చీల్చుకొని పైకి వచ్చి, నిరంతరం పెరుగుతూ ఉండటం విశేషం. సుమారు రెండు దశాబ్దాలుగా అంటే దాదాపు 20 సంవత్సరాలుగా ఈ దివ్యమైన పుట్ట పెరుగుదల కొనసాగుతోంది.

ఈ అమ్మవారి ఆవిర్భావానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. ముందుగా ఈ కుటుంబం సొంతూరు కోనాపురమని, అక్కడ అమ్మవారు రాతి రూపంలో వెలశారని చెబుతారు. అప్పట్లో, ఆ కుటుంబానికి చెందిన ఓ పెద్దాయన పొలాలకి నీళ్ళు కట్టేందుకు వెళ్లినప్పుడు, ఆయనకు గజ్జల సౌండ్ వినిపించేదట. ఒకానొక సందర్భంలో అమ్మవారు తెల్ల చీర కట్టుకొని, బిస్తం పట్టుకున్న చిన్న పాప రూపంలో ప్రత్యక్షమై, తనను మారెమ్మ అని పరిచయం చేసుకొని, తనకు ఆలయం లేదని, ఎండకి ఎండుతున్నానని, వానకి నానుతున్నానని, గుడి కట్టించమని ఆదేశించిందట. ఆర్థిక స్తోమత లేకపోయినా, ఆ తాత ఊరూరా తిరిగి చందాలు పోగుచేసి, కోనాపురంలో అమ్మవారికి ఆలయం నిర్మించారని, అక్కడ గ్రామ జాతర కూడా నిర్వహించారని కుటుంబ సభ్యులు వివరించారు. ఆ తర్వాత కాలంలో, ఈ కుటుంబం పొలం అమ్మి సంజీవరాయనపల్లికి వచ్చి స్థిరపడిన తర్వాత, అమ్మవారు వారి ఇంట్లోనే పుట్ట రూపంలో తిరిగి వెలిశారు. మొదట్లో, దీనిని సాధారణ చెదల పుట్టగా భావించి, కుటుంబ సభ్యులు రెండు మూడు సార్లు తొలగించారట. అయితే, ఎంత తొలగించినా, మరుసటి రోజు ఉదయానికి అది తిరిగి అదే స్థానంలో పెరిగి ఉండటం, అదే సమయంలో కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఇతర కష్టాలు ఎదుర్కోవడంతో, వారు దీనిని దివ్యశక్తిగా గుర్తించి పూజించడం ప్రారంభించారు. పుట్ట ప్రస్తుతం రెండు గదులలో వ్యాపించి, నిరంతరం పెరుగుతూ ఉంది. ఇది సిమెంట్ గోడలు, ప్లాస్టింగ్ మధ్య నుంచి కూడా విస్తరిస్తోంది.

ఈ ప్రాంతానికి చెందిన భక్తులకు సంజీవరాయనపల్లి అమ్మవారు ఒక శక్తివంతమైన దేవతగా మారారు. ప్రతి శుక్రవారం, మంగళవారం ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలివచ్చి, తమ కోరికలను అమ్మవారికి నివేదిస్తారు. ఆరోగ్య సమస్యలు, సంతానం లేని వారికి, ఇతర జీవన కష్టాలతో బాధపడుతున్న వారికి అమ్మవారి దర్శనం ద్వారా ఉపశమనం లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. భక్తులు తమ అనుభవాలను పంచుకుంటూ, అమ్మవారిని నమ్మిన వారికి తప్పక మంచి జరుగుతుందని చెబుతారు. సంతానం లేని దంపతులు అమ్మవారిని దర్శించి, ఒడిలో కూర్చున్న అమ్మవారు ఒంటి పైన వచ్చి నిమ్మకాయ, అక్షంతలు ఇచ్చి, తొమ్మిది ప్రదక్షిణలు చేయించి, కవర్లలో వేసి కట్టించుకుంటే పిల్లలు పుడతారని నమ్మకం. ఇలా సంతానం పొందిన వారు తమ ముక్కుబడులు తీర్చుకోవడానికి తిరిగి వస్తుంటారు. ఈ పుట్టను తొలగించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందుల వల్ల, ప్రస్తుతం ఈ ఇంటిలోని రెండు గదులను పూర్తిగా అమ్మవారికి అంకితం చేశారు, వాటిని కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం లేదు. ఇది కేవలం ఒక ఇంట్లో వెలసిన దేవత కాదని, భక్తుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక దివ్యశక్తి అని సంజీవరాయనపల్లి అమ్మవారు నిరూపించుకుంటున్నారు.

(స్థానిక భక్తుల నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథనాన్ని ఇచ్చాం)