Srisalam dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు.. ఇంకా ప్రారంభం కాని ఔట్ ఫ్లో
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 44,554 క్యూసెక్కులుగా ఉండగా... నీటిని కిందికి వదిలిపెట్టడం లేదు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 44,554 క్యూసెక్కులుగా ఉండగా… నీటిని కిందికి వదిలిపెట్టడం లేదు. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను… ప్రస్తుతం 821.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 41.7622 టీఎంసీలుగా ఉంది. మరోవైపు కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.
కాగా, తుంగభద్ర నది ఎగువన కురుస్తున్న వర్షాలకు 15వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని, ఈ నీరు సోమవారం సుంకేసుల జలాశయానికి చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. హంద్రీనదిలో 13 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.
ఉపరితల ఆవర్తనం..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మచిలీపట్నంలో 89 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. దక్షిణ ఒడిశా పరిసరాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీరప్రాంతం వరకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తన కరెంట్ రుతు పవనాలకు తోడై వర్షాలు పడ్డాయి.
మరో రెండు రోజులు…
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సాధారణం కంటే 5-8 డిగ్రీలు తగ్గాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల కదలికతో జూలై 2 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
కర్నూలు జిల్లాలో పొంగిన వాగులు..
కర్నూలు జిల్లావ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. 54 మండలాల్లోనూ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో సగటు 35.5 మి.మీ. వర్షం నమోదైందని అధికారులు తెలిపారు. కోడుమూరు మండలం వర్కూరు వద్ద తుమ్మలవాగు ఉగ్ర రూపం దాల్చింది. వంతెనకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.