Heavy Rains: వానల కోసం ఎదురు చూసిన రైతులకు వరద కష్టాలు.. దెబ్బతిన్న వాణిజ్య పంటలు.. నీట మునిగిన వరి నారుమళ్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో నారుమడులను, నాట్లను భారీ వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. నాలుగు రోజుల క్రితం వర్షం కోసం ఎదురు చూసిన రైతులు... ఇప్పుడు ఏ క్షణం ఏ కట్ట తెగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉప్పొంగుతున్న వరదలు పంటను ముంచి.. ఆశలు తుంచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు అనుకున్న సమయానికి కురవడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా సాగును ప్రారంభించారు. దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలు వేశారు. వరి నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రైతులు వణికిపోతున్నారు. కాలువలు, వాగులు పొంగిపొర్లుతుండడంతో వేల ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు ముంపు బారినపడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో నారుమడులను, నాట్లను భారీ వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. సాగు భూముల్లో అడుగు లోతు నీరు చేరిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా వాణిజ్య పంటలు పండించే రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు ఏ వరద ముంచెత్తి గుండెకోతకు గురి చేస్తోందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పత్తి, మొక్క జొన్న, కంది పంటలు వర్షానికి పాడయ్యాయి. ఎడతెరిపి లేని వర్షాలతో కొత్తపేట నియోజకవర్గంలో వరిచేలు చెరువులను తలపిస్తున్నాయి. పంట బోదులనుంచి నీరు లాగే పరిస్థితి లేకపోవడంతో వరి మొనలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కంద, అరటి, కూరగాయల పంటలను వర్షపు నీరు ముంచెత్తింది.
భారీ వర్షాలకు కోనసీమలో 2వేల ఎకరాల వరిచేలు, పదివేల ఎకరాలకు ఉపకరించే నారుమళ్లు ముంపులో చిక్కుకున్నాయి. కాకినాడ జిల్లాలో 1100 హెక్టార్లలో వరి, 50 హెక్టార్లలో నారుమళ్లు ముంపులో ఉన్నాయి. నాట్లు పడిన చోట ఎకరాకు రూ.20 వేల పైచిలుకే పెట్టుబడి పెట్టారు. రెండ్రోజులు ఇలానే ఉంటే అంతా పోయినట్లేనని చెబుతున్నారు. మండపేట, రామచంద్రపురం, కపిలేశ్వరపురం, అయినవిల్లి, కాట్రేనికోన, రాజోలు, ఆత్రేయపురంలో తీవ్రత అధికంగా ఉంది. కొవ్వాడ కాలువ ఉప్పొంగడంతో తాళ్లపూడి, కొవ్వూరు, చాగల్లు, గోపాలపురం, నిడదవోలు మండలాల పరిధిలో 3వేల ఎకరాల వరి ముంపుబారిన పడింది.
ఇటు తెలంగాణలో భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగి వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. మొత్తంగా ప్రాజెక్టులు నిండుతున్నాయని ఆనందపడాలో, ఏ క్షణం ఏ కట్ట తెగుతుందోనని ఆందోళనపడాలో తెలీని పరిస్థితి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..